RSS Office: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి.. కన్నూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. Watch Video

బాంబు దాడిలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) ఆఫీస్‌ అద్దాలు పగిలినట్టు తెలిపారు. అక్కడున్న కుర్చీలు పడిపోయాయి.

RSS Office: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి.. కన్నూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. Watch Video
Rss Office Kannur
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 12, 2022 | 2:46 PM

Bomb Attack on RSS Office: కేరళలోని కన్నూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కన్నూర్ పయ్యన్నూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున బాంబు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై బాంబు విసిరి పారిపోయారు. బాంబు దాడిలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) ఆఫీస్‌ అద్దాలు పగిలినట్టు తెలిపారు. అక్కడున్న కుర్చీలు పడిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కన్నూర్ పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ముందుగా ఆ ప్రాంతాన్ని స్కాన్ చేయడం సీసీటీవీలో రికార్డయింది. అయితే దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం పోలీసు స్టేషన్‌కు చాలా దూరంలో ఉందని.. ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై బాంబు దాడి సీపీఎం కార్యకర్తల పనేనని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ లో చిక్కుకున్న అధికార పార్టీ దృష్టి మరల్చేందుకు ఇలాంటి పనులు చేస్తోందని బీజేపీ కన్నూర్ జిల్లా అధ్యక్షుడు ఎన్ హరిస్‌దాసన్ ఆరోపించారు.

ఇదిలాఉంటే.. జూన్ 30న సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయం గోడపై బాంబు దాడి జరిగింది. దీని తర్వాత కేరళలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.