Omicron Variant In India: థర్డ్‌ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న ఒమిక్రాన్.. ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమేనా?

Omicron: సెకండ్ వేవ్ సమయంలో మనదేశంలో ఆసుపత్రి పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, మందుల కొరతతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.

Omicron Variant In India: థర్డ్‌ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న ఒమిక్రాన్.. ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమేనా?
Omicron
Follow us
Venkata Chari

|

Updated on: Dec 02, 2021 | 8:01 PM

Omicron Variant In India: కరోనా కొత్త వేరియంట్ Omicronతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటి వరకు కొన్ని దేశాల్లోనే ఈ కేసులు వెలుగుచూశాయి. అయితే నేడు భారతదేశంలోనూ ఒమిక్రాన్ వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో మన దేశంలోనూ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈ కొత్త రూపాంతరం డెల్టా కంటే ప్రమాదకరమని, కరోనా వ్యాక్సిన్‌ను కూడా అడ్డుకుని వ్యాపిస్తుందని భయపడుతున్నారు. డెల్టా వేరియంట్ కారణంగానే భారతదేశంలో భయంకరమైన సెకండ్ వేవ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ 29 దేశాలకు విస్తరించింది. భారత్‌లోనూ కేసులు బయటపడడంతో మరోసారి పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

సెకండ్ వేవ్ సమయంలో మనదేశంలో ఆసుపత్రి పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, మందుల కొరతతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నందున, మనదేశంలో కూడా మూడవ వేవ్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఆక్సిజన్ కొరతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలు చేసిందో ముందుగా మనం అర్థం చేసుకుందాం.. అలాగే ఎక్కడెక్కడ కేసులు నమోదవుతున్నాయో కూడా వివరంగా తెలుసుకుందాం.

ఎంత ఆక్సిజన్ అవసరమో తెలుసా? ఏప్రిల్ 2020లో నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్రాలకు ఒక లేఖ రాసింది. సాధారణ బెడ్‌లో చేరిన రోగికి నిమిషంలో 7.14 లీటర్ల ఆక్సిజన్‌ ​​అవసరమని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఐసీయూలో చేరిన రోగికి నిమిషంలో 11.90 లీటర్ల ఆక్సిజన్ అవసరం అని పేర్కొన్నారు. దీని ఆధారంగా రాష్ట్రాలు తమ ఆక్సిజన్ అవసరాన్ని లెక్కించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌, జూన్‌లో ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను పూర్తిగా మార్చింది. జూన్‌లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఐసీయూలో చేరిన రోగికి నిమిషానికి 30 లీటర్ల ఆక్సిజన్, సాధారణ రోగికి నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ అవసరం అని పేర్కొంది.

సెకండ్ వేవ్‌ కంటే 1.25 రెట్ల కేసులకు రాష్ట్రాలు సిద్ధం కావాలి..! రెండవ వేవ్ పీక్స్‌లో వెలుగుచూసిన కేసుల కంటే 1.25 రెట్లు ఎక్కువ కేసులకు రాష్ట్రాలు సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. రెండవ వేవ్ తీవ్రరూపం దాల్చిన సమయంలో భారతదేశంలో ఒక్క రోజులో 4 లక్షలకు పైగా కేసులు వెలుగుచూడడం గమనార్హం. దీంతో పాటు, మూడవ వేవ్ సమయంలో మొత్తం రోగులలో 23 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాలని కోరింది.

మొదటి, రెండవ వేవ్‌లో ఆక్సిజన్ వినియోగం ఎలా ఉంది..! జూలై 2021లో లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, మొదటి వేవ్ తీవ్ర రూపం దాల్చిన సమయంలో ప్రతిరోజూ 3,095 టన్నుల ఆక్సిజన్ అవసరమని ప్రభుత్వం పేర్కొంది. రెండవ వేవ్ సమయంలో ఇది సుమారు మూడు రెట్లు పెరిగింది. ఆక్సిజన్ అవసరం రోజుకు 9 వేల టన్నులుగా ఉంది.

ప్రస్తుతం కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు.. మూడవ వేవ్‌ను ఎదుర్కోవడానికి ఎలా సిద్ధమవుతున్నాయి? ప్రస్తుతం దేశంలో కేరళ, మహారాష్ట్రల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మొత్తం యాక్టివ్ కేసుల పరంగా దేశంలో కేరళ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో రోజుకు 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆగస్టులో కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నప్పుడు ప్రతిరోజూ 110 టన్నుల ఆక్సిజన్‌ను వినియోగించింది. ఈ నేపథ్యంలో కేరళ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 రెట్లు పెంచుకుంది. రెండవ వేవ్ తీవ్ర రూపం దాల్చిన సమయంలో, మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. అప్పుడు రాష్ట్రానికి ప్రతిరోజూ దాదాపు 1700 టన్నుల ఆక్సిజన్ అవసరం అయింది. మూడవ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో 619 పీఎస్‌ఏలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. వీటిలో ఇప్పటికే 150 మొదలుపెట్టారు. దీనితో పాటు ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని కూడా దాదాపు 3 వేల టన్నులకు పెంచారు.

ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తిని ఎలా పెంచుతోంది? రెండవ వేవ్ తర్వాత, దేశవ్యాప్తంగా 3,631 ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్ (PSA) ప్లాంట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్లు గాలి నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి రోగులకు సరఫరా చేస్తుంది. అక్టోబర్ 6 నాటికి, 1100 కంటే ఎక్కువ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఇవి ప్రతిరోజూ 1750 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలవు. వీటిని ఆపరేట్ చేసేందుకు ప్రభుత్వం 7 వేల మందికి పైగా సాంకేతిక సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. దేశంలో రోజుకు 15 వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండవ వేవ్ సమయంలో, దేశంలో సుమారు 10 వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసింది. సెప్టెంబర్ 2021 నాటి సమాచారం ప్రకారం, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 2 లక్షల కంటే ఎక్కువ ఐసీయూ పడకలను సిద్ధం చేసింది. ఈ పడకలలో 50 శాతం వెంటిలేటర్లు కూడా ఉన్నాయి.

మూడవ వేవ్‌లో ఎన్ని హాస్పిటల్ బెడ్‌లు అవసరం కావచ్చు? రెండవ వేవ్ సమయంలో దేశంలో ఒక రోజులో గరిష్టంగా 4 లక్షల 14 వేల కేసులు వెలుగుచూశాయి. మూడవ వేవ్ సమయంలో మొత్తం రోగులలో 23 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. మూడోదశలో ఒక్కరోజులో 4.14 లక్షల కేసులు నమోదైతే ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. అంటే దాదాపు 95 వేల ఆసుపత్రి పడకలు సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.

Also Read: Omicron Variant: తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ వణుకు.. ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించిన రెండు రాష్ట్రాలు..

Electricity Bill 2021: ఈ బిల్లుతో కరెంట్ చార్జీలు మీ జేబులు ఖాళీ చేస్తాయి.. అయినా ఫర్వాలేదు అంటున్న ప్రభుత్వం ఎందుకంటే..