ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ తయారీ పరిశ్రమ.. భారత్లో నిర్మించబోతున్న ఆ సంస్థ.. ఎక్కడంటే?
ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమను భారత్లో నిర్మించనున్నట్లు ఓలా ప్రకటించింది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ కూడా చేసుకుంది ఈ సంస్థ.
ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమను భారత్లో నిర్మించనున్నట్లు ఓలా ప్రకటించింది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ కూడా చేసుకుంది ఈ సంస్థ. ప్రతి సంవత్సరం ఈ కర్మాగారంలో 20 లక్షల వరకు ద్విచక్ర వాహనాలను తయారు చేయనుందని.. ఇది యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ తయారి సంస్థగా నిలుస్తుందని ఓలా పేర్కోంది. తమిళనాడులో ఈ పరిశ్రమ నెలకొల్పితే సుమారుగా 10వేల మందికి ఉద్యోగాలు లభించవచ్చని తెలిపింది.
ఈ సందర్భంగా ఓలా కంపెనీ ఛైర్మన్, సీఈవో భవేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఓలా సంస్థకు కీలకమైన మైలు రాయి. ప్రపంచంలోనే అత్యాధునిక తయారీ కర్మాగారలలో ఇది ఒకటిగా నిలుస్తుంది. భారత్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయగలదని ఇది నిరూపిస్తుంది” అని తెలిపారు. కాగా మార్కెట్లోకి విద్యుత్ వాహనాన్ని తీసుకురావడానికి ఓలా తమ ప్రయాత్నాలను వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిశ్రమలో తయారు చేసే ద్విచక్ర వాహనాలను ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా వంటి దేశాల మార్కెట్లలో అమ్మడానికి ఓలా తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం దాదాపు 2000 మందిని ఈ సంస్థలో చేర్చుకోవడానికి ఓలా సిద్ధంగా ఉంది.