Odisha: 15 ఏళ్ల తర్వాత ఒకటవుతున్న మిత్రులు.. బీజేడీతో పొత్తుకు బీజేపీ పావులు..?
లోక్‌సభ ఎన్నికల వేళ ఒడిశాలో బిజూ జనతాదళ్‌తో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? ఇరుపార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయా? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ (బిజెడి) భారతీయ జనతా పార్టీతో తిరిగి బంధాన్ని కలుపుకోవాలని చర్చలు జరుపుతోంది.

లోక్‌సభ ఎన్నికల వేళ ఒడిశాలో బిజూ జనతాదళ్‌తో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? ఇరుపార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయా? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ (బిజెడి) భారతీయ జనతా పార్టీతో తిరిగి బంధాన్ని కలుపుకోవాలని చర్చలు జరుపుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ, రెండు పార్టీల నేతలు మళ్లీ పొత్తుపై సూచనలు చేసినట్లు సమాచారం. సీట్ల పంపకం చర్చలు విఫలమవడంతో 11 ఏళ్ల రాజకీయ భాగస్వామ్యం తర్వాత 2009లో బీజేడీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి వైదొలిగింది.
ఇటీవల ఒడిశాలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేవలం ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. తన ప్రసంగం ద్వారా కాంగ్రెస్ పార్టీపై గురిపెట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌పై కానీ.. ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్‌పై కానీ మోదీ ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. నవీన్ పట్నాయక్ జయంతి సందర్భంగా ఆయన తండ్రి, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌కు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇదంతా చూస్తుంటే, బీజేడీ విషయంలో మోదీ మౌనం వెనుక ఒడిశాలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేడీకి బీజేపీ చేరువ కాబోతోందనే దానికి ఇదే పెద్ద సంకేతమని చెబుతున్నారు..
ఈ క్రమంలోనే మార్చి 6వ తేదీన భువనేశ్వర్‌లోని పట్నాయక్ నివాసం నవీన్ నివాస్‌లో బీజేడీ నేతలు మూడు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఇంతలో, ఒడిశా బీజేపీ నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జెపీ నడ్డాతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. అందులో వారు నవీన్ పట్నాయక్ వైపు సంభావ్య పొత్తుతో సహా ఎన్నికల విషయాలను చర్చించారు. BJD సమావేశం తరువాత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా బిజెపితో పొత్తు గురించి చర్చలు జరుగుతున్నట్లు అంగీకరించారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంలో రాష్ట్రం గణనీయంగా పురోగమించిందని, ఒడిశా ప్రజల ప్రయోజనాలకు బిజెడి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. రాబోయే లోక్‌సభ, విధానసభ ఎన్నికల వ్యూహానికి సంబంధించి సీనియర్ నాయకులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. పొత్తు చర్చలపై బిజెపి సీనియర్ నాయకుడు, ఎంపి జుయల్ ఓరమ్ స్పందించారు. రెండు పార్టీల మధ్య పొత్తుపై పార్టీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో బీజేపీ ఎనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాలు, 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, బీజేడీ 12 పార్లమెంట్ నియోజకవర్గాలు, 112 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి కూడా బీజేడీ, బీజేపీ మధ్య నువ్వా-నేనా అనే రీతిలో పోటీ ఉంటుందని, బీజేడీ 11, బీజేపీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి.. మరోవైపు నవీన్ పట్నాయక్.. ఇప్పటికే వరుసగా ఐదుసార్లు సీఎంగా పని చేస్తున్నారు..మరోసారి కూడా ఆయనే సీఎం అవుతారంటూ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒడిశాలో బీజేడీతో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? అంటే అవుననే పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
