AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నీళ్లు మిగిల్చిన చివరి మజిలీ.. బైక్‌పై 10 కి.మీ. మృతదేహం తరలింపు!

బాపట్ల జిల్లా కేంద్రానికి సమీపంలోనే జరిగిన హృదయ విదారక ఘటన… గుండెనొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లిన వ్యక్తి మృతి చెందగా, మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఆటో డ్రైవర్ రూ.3,000 డిమాండ్ చేశాడు. అంత స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు 10 కిలోమీటర్ల దూరం ద్విచక్ర వాహనంపైనే మృతదేహాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది.

కన్నీళ్లు మిగిల్చిన చివరి మజిలీ.. బైక్‌పై 10 కి.మీ. మృతదేహం తరలింపు!
Dead Body Shifted On Bike At Bapatla
Srilakshmi C
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 8:24 AM

Share

కర్లపాలెం, ఫిబ్రవరి 11: దేశం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని చెప్పుకునే రోజుల్లో కూడా.. ఒక మృతదేహాన్ని గౌరవంగా ఇంటికి తరలించే కనీస సదుపాయం లేకపోవడం బాపట్ల జిల్లాలో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. కర్లపాలెం మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఈ సంఘటన జరగడం మరింత బాధాకరం. కర్లపాలెం మండలం చింతయపాలెం పంచాయతీ రాళ్లచెరువుకు చెందిన నక్క నాగేశ్వరరావుకు అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు, సోదరులు ఆయనను ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఆటోను సంప్రదించారు. అయితే ఆటో డ్రైవర్ మూడు వేల రూపాయల వరకు అడిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత మొత్తం చెల్లించే స్తోమత లేకపోవడంతో చివరికి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనతోనే మరో మార్గం లేక మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపైనే ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆసుపత్రి నుంచి గ్రామం వరకు సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ, మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ పరంగా గానీ, స్థానిక పరంగా గానీ సరైన వాహన సదుపాయం లేకపోవడం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన మహాప్రస్థానం వంటి మృతదేహ రవాణా వాహనాలు అందుబాటులో లేవా? అనే ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఉచితంగా మృతదేహ రవాణా సేవలు అందించాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా.. అతడిని గౌరవంగా ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటం మన సమాజానికి, మన వ్యవస్థకు తలవంచే విషయం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.