ఢిల్లీకి అందుబాటులో మరో అంతర్జాతీయ విమానాశ్రయం.. నేటి నుంచి ట్రయల్ రన్..
NOIDA AIRPORT: పెరిగిన రద్దీ, పెరుగుతున్న డిమాండ్‌తో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీకి సమీపంలో నోయిడా శివార్లలో జేవర్ వద్ద అధునాతన హంగులు, సదుపాయాలతో మరో అంతర్జాతీయ విమానాశ్రయం "నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్" (NIAL) రెడీ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీకి మరో అంతర్జాతీయ విమానాశ్రయం అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఢిల్లీ నగరంలో జీఎంఆర్- ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (GMR-IGIA) ఉండగా.. ఇది దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా మారింది. దీంతో పాటు రక్షణశాఖ పరిధిలో ఎయిర్‌బేస్‌లు ఉన్నప్పటికీ, వాటికి పూర్తిగా రక్షణ అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన రద్దీ, పెరుగుతున్న డిమాండ్‌తో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీకి సమీపంలో నోయిడా శివార్లలో జేవర్ వద్ద అధునాతన హంగులు, సదుపాయాలతో మరో అంతర్జాతీయ విమానాశ్రయం “నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్” (NIAL) రెడీ అవుతోంది. మొత్తం 4 దశల్లో నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టులో మొదటి దశ పూర్తయి కార్యాకలాపాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. సరికొత్త ఈ విమానాశ్రయ నిర్మాణంలో మరో మైలురాయిని ఈరోజు చేరుకోనుంది. నేటి నుంచి విమానాల ల్యాడింగ్, టేకాఫ్ పరీక్షలను నిర్వహించి.. లోటుపాట్లను సరిదిద్దనున్నారు. తొలిసారిగా ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్‌లో భాగంగా చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తయితే.. ఈ విమానాశ్రయం 2025 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ట్రయల్ రన్‌లో ఏం చేస్తారు?
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) విమానం ట్రయల్ కోసం నోయిడా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరే విమానం నిమిషాల వ్యవధిలో నోయిడా విమానాశ్రయానికి చేరుకుంటుంది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (NIAL), అవసరమైన డేటాను రికార్డ్ చేయడానికి ఈ విమానం నోయిడా విమానాశ్రయం మీదుగా గంటన్నర పాటు గాల్లోనే ఎగురుతుంది. విమానాశ్రయం పూర్తిగా ప్రయాణికుల కోసం తెరవడానికి సిద్ధంగా ఉందో లేదో నిర్ధారించడంలో ఈ డేటా కీలక పాత్ర పోషిస్తుంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి ప్రారంభమయ్యే విమాన ప్రయోగాలు డిసెంబర్ 15 వరకు కొనసాగుతాయి. ల్యాండింగ్, టేకాఫ్‌తో పాటు గ్రౌండ్ ఆపరేషన్లు అన్నింటినీ కూడా ఈ ట్రయల్ రన్ సమయంలో పరీక్షిస్తారు. రన్‌వే పనితీరు, ఎయిర్‌స్పేస్ కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వంటి సన్నాహాలను కూడా ట్రయల్ రన్ సమయంలో అంచనా వేస్తామని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ తెలిపింది. ఈ ట్రయల్ తర్వాత సేకరించిన డేటా సమీక్ష కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి పంపిస్తారు. అన్నీ సవ్యంగా ఉన్నాయనుకుంటే కార్యకలాపాలు ప్రారంభించేందుకు DGCA అనుమతినిస్తుంది.
- రన్‌వే పనితీరు పరీక్ష: నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో 3.9 కి.మీ పొడవైన రన్‌వేను నిర్మించారు. రన్ వే పొడవు, లైటింగ్ సిస్టమ్, ఉపరితల స్థితిని ట్రయల్ రన్‌లో భాగంగా పరీక్షిస్తారు.
- నావిగేటింగ్ సిస్టమ్ మూల్యాంకనం: ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS), ప్రెసిషన్ అప్రోచ్ పాత్ ఇండికేటర్ (SIN) సిస్టమ్‌ల ఖచ్చితత్వాన్ని తనిఖీ చేస్తుంది.
- కమ్యూనికేషన్ ప్రోటోకాల్ పరీక్ష: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), ఎయిర్‌క్రాఫ్ట్ మధ్య సమన్వయాన్ని నిర్ధారించడం కోసం పరీక్షలు నిర్వహిస్తారు.
- ఎమర్జెన్సీ సిమ్యులేషన్: ఇంజన్ వైఫల్యం లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్ పనితీరు, సిబ్బంది స్పందించే వేగాన్ని ఈ పరీక్షలో నిర్థారిస్తారు.
విమానాశ్రయం విశేషాలు
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (NIAL)ను జూరిచ్ ఇంటర్నేషనల్ ఏజీ అనుబంధ సంస్థ యమున ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (YIAPL) నిర్మించి, అభివృద్ధి చేస్తోంది. 40 ఏళ్ల పాటు ఈ విమానాశ్రయాన్ని నిర్వహించేందుకు జూరిచ్ ఇంటర్నేషనల్ ఏజీ సంస్థ కాంట్రాక్ట్ పొందింది. మొదటి దశ పనులు ఇప్పటికే 85 శాతం పూర్తయ్యాయి. టర్మినల్ భవనం దాదాపు పూర్తికావొచ్చింది. ఇందులో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో అధునాతన హంగులతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయంలో 38 మీటర్ల ఎత్తైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలకు పూర్తి సిద్ధంగా ఉంది. ఇందులో ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరును ట్రయల్ రన్‌లో భాగంగా పరీక్షించనున్నారు.
ఈ విమానాశ్రయం ఇప్పటికే 2024 అక్టోబర్ నెలలో ప్రెసిషన్ అప్రోచ్ పాత్ ఇండికేటర్ (PAPI), ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS) పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకుంది. పొగమంచు దట్టంగా ఉన్న సమయంలో విజిబిలిటీ క్షీణించినప్పుడు ILS, PAPI వ్యవస్థలు విమానాన్ని సురక్షితంగా కిందికి దించడంలో సహకరిస్తాయి. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నోడల్ ఆఫీసర్ శైలేంద్ర భాటియా మాట్లాడుతూ.. డిసెంబర్ 15లోపు ట్రయల్స్ పూర్తి చేయడం తమ లక్ష్యమని చెప్పారు. విమానాశ్రయం పూర్తి కార్యకలాపాలను ప్రారంభించడానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తామని వెల్లడించారు. సీనియర్ IAS అధికారి SP గోయల్‌తో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, DGCA, NIAL, ఉత్తరప్రదేశ్ పౌర విమానయాన శాఖ అధికారులు ట్రయల్ రన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు.
ఈ ట్రయల్ తర్వాత ఆకాశ, ఇండిగో ఎయిర్‌లైన్స్ వంటి ఎయిర్‌లైన్ భాగస్వాములు కూడా తమ సొంత ట్రయల్స్ నిర్వహించుకోవచ్చని NIAL అధికారులు తెలిపారు. 1,334 హెక్టార్లలో విస్తరించిన ఈ విమానాశ్రయాన్ని నాలుగు దశల్లో రూ.29,650 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. 4వ దశ విమానాశ్రయం పూర్తయిన తర్వాత ఏడాదికి 7 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేస్తుందని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిస్టోఫ్ ష్నెల్‌మన్ తెలిపారు. రూ. 10,056 కోట్లతో మొదటి దశ పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభిస్తే ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఈ విమానాశ్రయం పనిచేయనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి