Covid-19 Booster Dose: బూస్టర్ డోసు అవసరంపై ICMR ఆసక్తికర వ్యాఖ్యలు
Covid-19 Booster Dose: కోవిడ్-19 బారి నుంచి రక్షణ కల్పించేందుకు బూస్టర్ డోసు (మూడో డోసు) అవసరంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు అవసరమా? లేదా? అన్న అంశంపై..
కోవిడ్-19 బారి నుంచి రక్షణ కల్పించేందుకు బూస్టర్ డోసు (మూడో డోసు) అవసరంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు అవసరమా? లేదా? అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లో వ్యాక్సిన్ కార్యక్రమంపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం(NTAGI) వచ్చే సమావేశంలో బూస్టర్ డోసుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసుపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బూస్టర్ డోసు అవసరమనేందుకు ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతానికి దేశంలోని అర్హులందరికీ రెండు డోసు వేయించడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. భారతీయులతో పాటు ప్రపంచం వ్యాప్తంగా అర్హులైన అందరకీ వ్యాక్సిన్ వేయించడం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రాధాన్య అంశంగా వివరించారు.
ప్రస్తుతం అర్హులైన అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పష్టంచేశారు. బూస్టర్ డోసు విషయంలో నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టంచేశారు. బూస్టర్ డోస్ ఇవ్వాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేస్తే.. దాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. వ్యాక్సిన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయమైనా వైద్య నిపుణుల సూచనల మేరకే తీసుకుంటున్నట్లు వివరించారు.
అధికారిక సమాచారం మేరకు దేశంలో ఇప్పటి వరకు 82 శాతం మంది అర్హులు మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోగా.. 43 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు 116.87 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు. రెండో డోస్ తీసుకోని వారిని గుర్తించి.. వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఇంటింటికి టీకా కార్యక్రమం చేపడుతున్నారు. అధికారిక సమాచారం మేరకు రెండో డోసుకు గడువు వచ్చినా ఇంకా 12 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు.
Also Read..
ప్రపంచంలోనే అతి చిన్న గేమ్ కన్సోల్.. కొత్త గేమ్ సృష్టించండి ఇక.. ఫీచర్స్ బోలేడు..
Kaikala Satyanarayana: వదంతులు నమ్మొద్దు.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కూతురు..