AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India CEO: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియా సీఈవో సంచలన కామెంట్స్..

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో తేల్చింది. మరోవైపు విమానంలో ఎటువంటి నిర్వాహణ సమస్యలు లేవని ఎయిరిండియా సీఈవో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఉద్యోగులకు రాసిన లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు.

Air India CEO: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియా సీఈవో సంచలన కామెంట్స్..
Air India Plane Crash
Krishna S
|

Updated on: Jul 14, 2025 | 4:37 PM

Share

అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల కలలను చిదిమేసింది. దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా నిలిచిన ఈ దుర్ఘటనలో 250మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదం జరిగి నెల దాటింది. దీనికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వార్త చర్చకు వస్తూనే ఉంది. ఇటీవలే విమానానికి ఇంధనం అందకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏఏఐబీ 15 పేజీలతో ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ఇంధన కంట్రోల్ స్వీచ్‌లు ఆఫ్ అయ్యాయని.. పైలట్లు సైతం ఇదే విషయంపై మాట్లాడుకున్నారని వెల్లడించింది. కంట్రోల్ స్విచ్ ఎందుకు ఆపావని పైలట్.. కో-పైలట్‌ను అడగ్గా.. నేను ఆపలేదని ఆయన చెప్పినట్లు రిపోర్టు వెల్లడించింది. ఇవే పైలట్ల చివరి మాటలని తెలిపింది. ఈ క్రమంలో ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ కీలక విషయాలను వెల్లడించారు. ఇంజిన్‌లలో ఎటువంటి నిర్వాహణ సమస్యలు లేవని వ్యాఖ్యానించారు.

ప్రమాదంపై వస్తున్న ఊహాగానాలు, పుకార్లను ఖండిస్తూ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విమానంలో ఎటువంటి సమస్య లేదని.. టేకాఫ్ సమయంలోనూ ఏ సమస్య తలెత్తలేదని అన్నారు. పైలట్లు ప్రీ-ఫ్లైట్ బ్రీత్‌అనలైజర్‌ టెస్టులోనూ పాస్ అయినట్లు చెప్పారు. అదేవిధంగా వారికి ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ లేవన్నారు. ‘‘ ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి పక్కా కారణాన్ని ఏఏఐబీ వెల్లడించలేదు. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇప్పుడే ఓ నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదు. మనం మన పనిపై ఫోకస్ పెట్టాలి’’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో విల్సన్ చెప్పారు. దర్యాప్తుకు సహకరించడానికి ఎల్లప్పుడు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలపారు.

మరోవైపు పైలట్లపై వస్తున్న పుకార్లను ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఖండించింది. పైలట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు తెలిపింది. ప్రమాద సమయంలోనూ సరిగ్గానే వ్యవహరించారని.. వారిపై అనవసర నిందలు వేయొద్దని విజ్ఞప్తి చేసింది. తుది నివేదిక వచ్చేవరకు ఓపిక పట్టాలని ఇప్పుడే ఓ నిర్ధారణకు రావొద్దని సూచించింది. అటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. దర్యాప్తు కొనసాగుతుందని.. ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..