AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NITISHKUMAR STRATEGY: సీఎంగా కొనసాగడమే ఆయన లక్ష్యం కాదు.. నితీశ్ కుమార్ భవిష్యత్ ప్రణాళికలో లెక్కలు, వ్యూహాలు ఇవే!

నితీశ్ కదలికలను ముందుగానే పసిగట్టారో ఏమోగానీ కమలనాథులు కూడా పెద్దగా స్పందించలేదు. మొక్కుబడిగా పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించి, బీహార్ పరిణామాలను షరామామూలుగా చర్చించి వదిలేశారు.

NITISHKUMAR STRATEGY: సీఎంగా కొనసాగడమే ఆయన లక్ష్యం కాదు.. నితీశ్ కుమార్ భవిష్యత్ ప్రణాళికలో లెక్కలు, వ్యూహాలు ఇవే!
Modi, Nitish, Sharadpawar Rahul
Rajesh Sharma
|

Updated on: Aug 10, 2022 | 7:44 PM

Share

NITISHKUMAR STRATEGY SUPERB FOCUS ON PRIMEMINISTER POST: రెండు నెలల క్రితం మహారాష్ట్ర పాలిటిక్స్ ఇచ్చినంత మజా బీహార్ పాలిటిక్స్(bihar politics) ఇవ్వలేదు. కేవలం రెండంటే రెండు రోజుల్లోనే బీహార్ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయడం, ఆర్జేడీ(RJD), కాంగ్రెస్ పార్టీల నేతలతో మంతనాలు జరపడం.. గవర్నర్‌ను కలిసి తమ మహా ఘట్ బంధన్‌(Mahagathbandhan)కు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు వుందని లేఖలు సమర్పించడం.. మర్నాడే మళ్ళీ సీఎంగా నితీశ్ ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. మారినదల్లా పాలక పక్షం నుంచి బీజేపీ విపక్షంలోకి చేరింది. విపక్షంలో వున్న ఆర్జేడీ, కాంగ్రెస్(Congress), వామపక్షాలు(Left parties) అధికార పక్షాలుగా మారిపోయాయి. బీజేపీ సహా అన్ని పార్టీలు తమకంతా ముందే తెలుసన్నట్లు నితీశ్ చర్యలను నిలువరించేందుకో లేక తమతమ షరతుల మేరకు ఆయన చర్యలను కొనసాగించేలా చేయడమో లాంటి ప్రయత్నాలేవీ కనిపించలేదు. నితీశ్ కదలికలను ముందుగానే పసిగట్టారో ఏమోగానీ కమలనాథులు కూడా పెద్దగా స్పందించలేదు. మొక్కుబడిగా పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించి, బీహార్ పరిణామాలను షరామామూలుగా చర్చించి వదిలేశారు. ఓ దశలో నితీశ్‌ను నిలువరించేందుకు అమిత్ షా(Amit Shah) ప్రయత్నిస్తున్నట్లు నేషనల్ మీడియాలో బ్రేకింగ్స్ వచ్చినా.. అలాంటి ప్రయత్నమేదీ ఆయన చేసినట్లు దాఖలాలు లేవు. గత రెండు నెలలుగా తమతో అంటీముట్టనట్లు వుంటూ.. కీలక భేటీలకు దూరంగా, కీలక ఎన్నికల సమయంలో స్తబ్ధుగా వున్న నితీశ్ కదలికలను బీజేపీ నేతలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. నితీశ్ వ్యూహాలు, ఆయన్ను దగ్గర చేసుకునేందుకు యూపీఏ(UPA) పక్ష పార్టీలు వేస్తున్న ఎత్తుగడలను కమలం అధిష్టానం ముందే పసిగట్టింది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో యూపీఏ పక్షాలు పని చేస్తున్నా.. ఆ పార్టీ బలహీన పడిన నేపథ్యంలో తాము సొంతంగా ఎత్తుగడలను వేసేందుకు, ఆ ఎత్తుగడలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు వుందని చాటేందుకు యూపీఏ కూటమి పక్షాలు చాన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే రాష్ట్రపతి అభ్యర్థిగా ఒకప్పటి బీజేపీ నేత, మోదీ(PM ModI) వ్యతిరేకి అయిన యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎన్సీపీ(NCP) లాంటి పార్టీలు ఒప్పించాయి. ఇక ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మోదీకి ప్రత్యామ్నాయంగా ఓ మచ్చలేని నాయకుడిని ప్రొజెక్ట్ చేయాల్సిన అగత్యం యూపీఏ పక్ష పార్టీలకు వుంది. ఆ కోణంలో నితీశ్ పేరుపై గత కొన్నాళ్ళుగా యూపీఏ పక్షాలు వ్యూహాత్మకంగా లీకేజీలిస్తున్నారు. బహుశా తనలో కూడా ఆ ఆశ మొదలైందో ఏమోగానీ నితీశ్.. ఎన్డీయే(NDA)కు దూరమై యూపీఏ వైపు మొగ్గు చూపారు.

మహారాష్ట్ర, బీహార్ అంశాలలో కొన్ని సామీప్యాలు, కొన్ని వైరుద్యాలు వున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కలిసి ఎన్నికలకు వెళితే.. బీజేపీకి ఎక్కువ, శివసేనకు తక్కువ సీట్లు వచ్చినట్లుగానే బీహార్ అసెంబ్లీకి 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ (74) జేడీయూకి తక్కువ (45) సీట్లు దక్కాయి. కానీ మహారాష్ట్ర మాదిరిగా బీజేపీ.. బీహార్‌లో సీఎం సీటుకోసం పట్టుబట్టలేదు. ఎన్నికలకు ముందు అనుకున్నట్లుగానే నితీశ్‌కే ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు కమలనాథులు. ఆ సందర్భంలో బీహార్ బీజేపీ ముఖ్య నేతలు అలకబూనినా పార్టీ అధిష్టానం వారిని అనునయించి మరి నితీశ్‌కే సీఎం సీటు కట్టబెట్టింది. ఇక్కడి వరకు బాగానే వున్నా.. ఆ తర్వాతే నితీశ్ కుమార్‌కు ఇబ్బందికరమైన నిర్ణయాలను బీజేపీ అధిష్టానం తీసుకుంది. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం అనేకంటే నరేంద్ర మోదీ, అమిత్ షాలు నితీశ్ కుమార్‌ను ఇబ్బందులకు గురిచేశారని చెప్పడం సబబుగా వుంటుంది. బ్యూరోక్రాట్ టర్న్డ్ పొలిటిషియన్ అర్సీపీ సింగ్‌కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడం నితీశ్, మోదీల మధ్య గ్యాప్ పెంచేసింది. నిజానికి ఆర్సీపీ సింగ్‌ని రాజ్యసభకు పంపించింది నితీశ్ కుమారే. కానీ, మోదీ కేబినెట్‌లో జేడీయూని చేరమన్నప్పుడు ఆయన రెండు కేబినెట్ బెర్తులు అడిగారు. కానీ ఎవరి పేరును ప్రతిపాదించలేదు. మోదీ మాత్రం ఒక బెర్తు ఇస్తూనే దాన్ని నితీశ్ అభీష్టానికి భిన్నంగా ఆర్సీపీ సింగ్‌కు ఇచ్చారు. ఈ విషయంలో కినుక వహించిన నితీశ్ వెంటనే పగ తీర్చుకున్నారు. ఆర్సీపీ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో ఆయన్ను మరోసారి పెద్దల సభకు పంపలేదు. దాంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈరకంగా కాస్త కటువుగా మెదిలిన నితీశ్ విషయంలో మోదీ, అమిత్ షా లోలోపల మండిపడ్డా మిత్రపక్షం కావడంతో పైకి ఏమీ మాట్లాడ లేదు. కానీ ఈ మధ్యకాలంలో బీహార్ విషయాల్లో అమిత్ షా జోక్యం క్రమంగా పెంచుకుంటూ పోయారు. ఇది మోదీ, అమిత్ షాలతో నితీశ్ కుమార్‌కు మధ్య గ్యాప్ మరింత పెంచింది. గత రెండు నెలలుగా అయితే ఈ గ్యాప్ ప్రస్ఫుటంగా కనిపించింది. గత నెలలో జరిగిన అఖిలపక్షానికి, మొన్నఈ మధ్య జరిగిన నీతి ఆయోగ్ భేటీకి నితీశ్ హాజరు కాలేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు ఓట్లేసినా మోదీ, అమిత్ షాలతో అంటీముట్టనట్లుగానే వున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్.. బీజేపీకి కట్ కొట్టి.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతో జత కట్టొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాలు కొనసాగుతుండగానే బీజేపీని, ఎన్డీయేను వీడితే నితీశ్ కుమార్‌కు తామూ మద్దతిస్తామని వామపక్షాలు కూడా సందెట్లో సడేమియాలాగా ప్రకటన చేశాయి. ఈ కోణంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిపి 164 మంది ఎమ్మెల్యేల మద్దతు నితీశ్ కుమార్‌కు దక్కింది. ఇంకేముంది సుమారు 30 గంటల వ్యవధిలోనే సీఎం సీటుకు రాజీనామా చేసి.. మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేశారు నితీశ్ కుమార్.

నితీశ్ కుమార్ లక్ష్యం సీఎంగా కొనసాగడమేనా అంటే కాదనే చెప్పాలి. ఆయనిప్పటికే 22 ఏళ్ళ వ్యవధిలో ఏకంగా ఎనిమిదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ఓటమిపాలైతే.. ఆ పార్టీకి మద్దతిచ్చే పార్టీల సంఖ్య పెద్దగా వుండదు. ఎందుకంటే ఇప్పటికే గత ఎనిమిదేళ్ళలో ఎన్డీయేకు అకాలీదళ్, శివసేన, టీడీపీ దూరమయ్యాయి. ఇపుడు జేడీయూ దూరమైంది. ఈ నాలుగు పార్టీల్లో టీడీపీ, అకాలీదళ్ మళ్ళీ ఎన్డీయేతో జతకట్టే అవకాశాలు లేకపోలేదు. కానీ వాటి సంఖ్య ఆయా రాష్ట్రాలలో ఏ మేరకు పెరుగుతుంది అన్నది సందేహమే. ఈక్రమంలో బీజేపీ 200 సీట్లలోపునకు పరిమితమై, కాంగ్రెస్ పార్టీ ఏ వంద స్థానాల దగ్గరే ఆగిపోతే అప్పుడు యుపీఏలో కాంగ్రెసేతర పార్టీకి, వ్యక్తికి ప్రధాన మంత్రి పదవి దక్కే అవకాశం వుంటుంది. శరద్ పవార్‌కు పీఎం కావాలన్న కోరిక వుంది. అందుకే ఆయన ఇటీవలి రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున అభ్యర్థిగా వుండేందుకు మొగ్గు చూపలేదు. కాకపోతే శరద్ పవార్ వయస్సు ఆయనకు అడ్డంకి మారే అవకాశం వుంది. 2022 డిసెంబర్‌ నాటికి శరద్ పవార్ 82 ఏళ్ళ వయస్సుకు చేరుకుంటారు. ఆ క్రమంలో శరద్ పవార్ (Sharad Pawar) తర్వాత వినిపించే పేరు కచ్చితంగా నితీశ్ కుమార్‌దే అవుతుంది. అందుకు నితీశ్ కుమార్ పొలిటికల్ ఎక్స్‌పోజర్, అవినీతి మచ్చ లేకపోవడం, సోషలిస్టు నేపథ్యం.. ఇలా చాలా అంశాలు నితీశ్ కుమార్‌కు సానుకూలంగా కనిపిస్తున్నాయి. సో.. అంకెల గారడీ పని చేస్తే.. వచ్చే రెండేళ్ళలో మోదీ చరిష్మా గ్రాఫ్ గణనీయంగా పతనమైతే అవి నితీశ్‌కు కలిసి వచ్చే అంశాలుగా మారతాయి.

కాకపోతే, ఏ కోణంలో చూసినా నరేంద్ర మోదీ చరిష్మాతో నితీశ్ కుమార్ సరితూగరు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ 1989, 1996 సందర్భాలు బహుశా నితీశ్‌ని టెంప్ట్ చేసి వుండొచ్చు. ఎలాగో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ధీటైన ప్రత్యామ్నాయ నేతను దేశ ప్రజల ముందుంచలేకపోయింది. ఇక రెండు దఫాల పరిపాలనాకాలం పూర్తి చేసుకున్న తరుణంలో ఎన్డీయే ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత వుంటుంది. అది విపక్షాల సంఖ్యాబలం పెరగడానికి కారణమవుతుంది. బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన 303 స్థానాలు రాకపోవచ్చు. ఆ తరుణంలో కాంగ్రెస్, బీజేపీలు ఏకపక్షంగా మెజారిటీ మార్క్‌ని దాటకపోతే అది కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విపక్ష కూటమి పరిపాలనా పగ్గాలు చేపట్టే అవకాశాన్ని ఇస్తుంది. అలాంటి పరిస్థితిలో నితీశ్ కుమార్ సరైన ప్రత్యామ్నాయంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటికీ కనిపించే అవకాశం వుంది. చంద్రశేఖర్ (Chandrashekhar), ఐకే గుజ్రాల్ (IK Gujral) లాంటి వారిని వరించినట్లు అదృష్టలక్ష్మి తననూ వరిస్తే.. దేశ ప్రధాని పీఠాన్ని అధిష్టించే అవకాశమూ దక్కవచ్చు.. అదే ఎన్డీయే కూటమిలో కొనసాగితే పీఎం అయ్యే అవకాశాలు దాదాపు మృగ్యం. ఈ తరహా సింహావలోకనం జరిపిన తర్వాతే నితీశ్ శరవేగంగా పావులు కదిపి.. ఆర్జేడీ పంచన చేరినట్లు తేటతెల్లమవుతోంది. ఈ వ్యూహంలో భాగంగా నితీశ్ తన పార్టీ జేడీయూని ఆర్జేడీలో విలీనం చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని ఓ రాజకీయ విశ్లేషకుడు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తోంది. కానీ నితీశ్ కల నెరవేరాలంటే బీజేపీ మరీ దారుణంగా కునారిల్లిపోవాలి.. అటు కాంగ్రెస్ పార్టీ ఓ మోస్తరుగానే పుంజుకోవాలి… ఇటు బీజేపీ పూర్తిగా దెబ్బతినకపోయినా.. అటు కాంగ్రెస్ పార్టీ భయంకరంగా పుంజుకున్నా నితీశ్ కల కలగానే మిగిలిపోవడం ఖాయం.