మరో నలుగురు బిహార్ పోలీసులకోసం ముంబై ఖాకీల ‘గాలింపు’ !
సుశాంత్ సింగ్ కేసులో దర్యాప్తు చేయడానికి పాట్నా నుంచి ముంబై వచ్చిన పోలీసు అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ కి తరలించిన ముంబై ఖాకీలు..
సుశాంత్ సింగ్ కేసులో దర్యాప్తు చేయడానికి పాట్నా నుంచి ముంబై వచ్చిన పోలీసు అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ కి తరలించిన ముంబై ఖాకీలు..ఆయన వెంట వచ్చిన మరో నలుగురు పోలీసులను కూడా ఇలాగే క్వారంటైన్ కి పంపాలని యోచిస్తున్నారు. అయితే వీరు ఎక్కడ ఉన్నారన్న సమాచారం తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. బిహార్ పోలీసులనందరినీ క్వారంటైన్ కి తరలించాలన్నది వీరి యోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నలుగురు పాట్నా పోలీసులూ ఓ రహస్య ప్రదేశంలో ఉన్నట్టు సమాచారం. వినయ్ తివారీ చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంపు వేసిన ముంబై పోలీసుల చర్యపై బిహార్ పోలీసు శాఖలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీరి ఈ విచిత్ర చర్యను బిహార్ అసెంబ్లీలో కొందరు సభ్యులు ప్రభుత్వ దృష్టికి తేనున్నారు.
సాక్షాత్తూ సీఎం నితీష్ కుమారే దీనిపై తీవ్ర అసంతృప్తి చేసిన విషయం గమనార్హం. తమ రాష్ట్ర పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా ముంబై వెళ్లారని, ఇందులో రాజకీయ కోణం లేదని ఆయన స్పష్టం చేశారు.