Param Bir Singh Vs Anil Deshmukh : నెలకు 100 కోట్లు వచ్చి పడాలనేది హోంమంత్రి మౌఖిక ఆదేశాల్లోని సారాంశమట.!
Param Bir Singh Vs Anil Deshmukh : మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారుకు ఊహించని షాక్ తగిలింది. బార్లు, రెస్టారెంట్ల నుంచి మామూళ్లు వసూలు..
Param Bir Singh Vs Anil Deshmukh : మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారుకు ఊహించని షాక్ తగిలింది. బార్లు, రెస్టారెంట్ల నుంచి మామూళ్లు వసూలు చేయాలంటూ పోలీసులకు స్వయానా హోంమంత్రి పురమాయించడం చర్చనీయాంశంగా మారింది. అది కోటి రెండు కోట్లు కాదు.. నెలకు ఠంచనుగా 100 కోట్లు వచ్చి పడాలనేది హోంమంత్రి మౌఖిక ఆదేశాల్లోని సారాంశమట..!. ఈ విషయాన్ని చెప్పిందెవరో కాదు..! స్వయానా ముంబై మహానగరానికి పోలీసు కమిషనర్‌గా పనిచేసి, ఇటీవల హోంగార్డ్స్ విభాగానికి కమాండెంట్ జనరల్‌గా బదిలీ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పరమ్‌బీర్ సింగ్. ఇటీవల సస్పెండ్ అయిన అదనపు ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేతోపాటు.. ఏసీపీ సంజయ్ పాటిల్‌కు ఈ టార్గెట్‌ను సూచించారని ఆయన వెల్లడించారు. పరమ్‌బీర్ సింగ్ ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎనిమిది పేజీల లేఖ రాశారు. ఇదే ఇప్పుడు మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో కొత్త కలకలం రేపుతోంది.
ముంబై మహానగరంలో మొత్తం ఒక వెయ్యి 750 దాకా బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి నుంచి, ఇతర మార్గాల ద్వారా నెలకు 100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలి.. ఒక్కో బార్/రెస్టారెంట్ నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా వసూలు చేసినా.. 50 కోట్లదాకా వస్తాయంటూ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన కిందిస్థాయి అధికారులను వసూళ్లకు పురమాయించే ప్రయత్నం చేశారని సీఎంకు రాసిన లేఖలో పరమ్‌బీర్ ఆరోపించారు. కాగా, తన వ్యక్తిత్వంపై మచ్చవేశారనే ఆక్రోశంతోనే ఈ విషయాలను బయటపెట్టినట్లు పరమ్‌బీర్ ముఖ్యమంత్రికి రాసిన లేఖను బట్టి తెలుస్తోంది. ఏదేమైనా.. పరమ్‌బీర్ లేఖ ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపుతోంది. సొంత మెజారిటీ లేని శివసేనకు.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ NCP సీనియర్ నేత. పరమ్‌బీర్ లేఖ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి థాక్రే తన మిత్రపక్షం నేతపై చర్యలు తీసుకుంటారా..? లేక.. చూసీ చూడనట్లు వదిలేస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా.. విపక్ష బీజేపీకి అది ఓ కొత్త ఆయుధంలా మారనుంది. ఈ ఆరోపణలపై శివసేన మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక, ఈ మొత్తం వ్యవహారంపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే. ఈ సాయంత్రం కూటమి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో శివసేన లీడర్లతో పాటు NCP చీఫ్ శరద్ పవార్ కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం. హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలపై ప్రధానంగా చర్చించబోతున్నారు.
ఇప్పటికే రిలయన్స్ అధినేత అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు మహారాష్ట్ర రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపాయి. ఇదే కేసులో ఇప్పటికే సచిన్ వాజే అరెస్టయ్యారు. ఆ కారు యజమాని మన్‌సుఖ్ హిరేణ్ అనుమానాస్పద మృతి కేసులోనూ వాజే హస్తంతో పాటు.. పరమ్‌బీర్ సింగ్ సహకారంపై ఆరోపణలున్నాయి. అరెస్టు భయంతోనే పరమ్‌బీర్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్. సచిన్ వాజేపై పరువునష్టం దావా వేస్తానంటున్నారు.