Crime: దారుణం.. గాజు సీసాలో టపాసులు పేల్చొద్దంటూ అడ్డుకున్న యువకుడు.. ముగ్గురు మైనర్లు కలిసి ఏం చేశారంటే..
దేశవ్యాప్తంగా దీపావళి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దీపావళి.. అందరి ఇంట్లో సంతోషాలను నింపితే ఆ వ్యక్తి కుటంబంలో మాత్రం తీరని శోకాన్ని నింపింది.. అయితే, ఆ వ్యక్తి చేసిందేమీ పెద్ద నేరమేమీ కాదు..
దేశవ్యాప్తంగా దీపావళి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దీపావళి.. అందరి ఇంట్లో సంతోషాలను నింపితే ఆ వ్యక్తి కుటంబంలో మాత్రం తీరని శోకాన్ని నింపింది.. అయితే, ఆ వ్యక్తి చేసిందేమీ పెద్ద నేరమేమీ కాదు.. సాటి పౌరుడిగా చిన్నారులు తప్పు చేస్తున్నారని.. దీని వల్ల ప్రమాదం ఏర్పడుతుందని అడ్డుకున్నాడు.. కానీ.. అదే అతని పాలిట మృత్యుపాశమైంది. గ్లాసు బాటిల్‌లో టపాసులు కాల్చడాన్ని అడ్డుకున్నాడన్న కోపంతో.. ముగ్గురు చిన్నారులు ఓ యువకుడిని దారుణంగా చంపారు. ముగ్గురు కలిసి అతన్ని తీవ్రంగా కొట్టడంతోపాటు కత్తితో పొడిచి హత్యచేశారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని సునీల్ శంకర్ నాయుడు (21) గా ముంబై పోలీసులు తెలిపారు.
ముంబై నగరంలోని శివాజీ నగర్ నట్వార్ పరేఖ్ లో 12 ఏళ్ల బాలుడు గ్లాసు బాటిల్‌లో టపాసులు ఉంచి పేలుస్తున్నాడు. ఈ సమయంలో తన ఇంటి సమీపంలో బాలుడు కాలుస్తుండడంతో గమనించిన సునీల్ నాయుడు అక్కడికి వచ్చాడు. అలా చేయొద్దంటూ ఆ బాలుడికి అడ్డుచెప్పాడు. దీంతో బాలుడు.. నాయుడిపై తిరగబడ్డాడు.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవను గమనించి బాలుడి అన్న (15 ఏళ్లు), అతని స్నేహితుడి (14) తో అక్కడికి చేరుకొన్నాడు. అనంతరం ముగ్గురు కలిసి నాయుడిని కొట్టారు. ఈ క్రమంలో బాలుడి అన్న కత్తితో సునీల్ శంకర్ నాయుడిని పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి ముగ్గురు పరారయ్యారు.
మెడపై కత్తితో పొడిచిన తర్వాత సునీల్ కూడా మైనర్ల వెంట పరుగెత్తి కుప్పకూలాడు. తీవ్రగాయాలైన సునీల్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు మైనర్లపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశామని.. మరొక బాలుడు పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..