Army Couple: భర్త ఐఏఎఫ్ ఆఫీసర్.. భార్య ఆర్మీ కెప్టెన్.. ఒకే రోజు వేర్వేరు చోట్ల సూసైడ్! ఏం జరిగిందో..
దేశ ఆర్మీలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు ఆర్మీ అధికారులు ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరు దంపతులు కావడం, ఒకే సమయంలో ఆత్మహత్యకు పాల్పడటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: భర్త ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఆఫీసర్.. భార్య ఆర్మీ కెప్టెన్.. దేశ సేవలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ జంట ఒకేరోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏం జరిగిందో తెలియదుగానీ మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. తనను తన భర్త మృతదేహంతో కలిపి అంత్యక్రియలు చేయాలని ఆర్మీ కెప్టెన్ అయిన భార్య తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఉన్నట్లుండి ఆత్మహత్యకు పాల్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకెళ్తే..
బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన దీన్ దయాళ్ దీప్ (32) ఐఏఎఫ్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఖేరియా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇక రాజస్థాన్‌కు చెందిన ఆర్మీ కెప్టెన్ రేణు తన్వర్ ఆగ్రాలోని మిలిటరీ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మిలిటరీకి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ క్వాటర్స్‌లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. భర్త దీన్ దయాళ్ దీప్ ఆగ్రాలో, భార్య రేణు తన్వర్ ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్14 (సోమవారం) రాత్రి సహోద్యోగులతో కలిసి డిన్నర్ చేసిన ఐఏఎఫ్ అధికారి దీన్ దయాళ్ దీప్ తన క్వాటర్స్‌కు వెళ్లి నిద్రించాడు. మంగళవారం ఉదయం అతడు ఎంతకూ డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఎయిర్‌ఫోర్స్ అధికారులు తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. అతడు సూసైడ్ చేసుకున్నట్లు గమనించిన అధికారులు ఆగ్రా పోలీసులకు సమాచారం అందించారు. అయితే అతడి గదిలో సూసైడ్ నోట్ ఏదీ లభ్యం కాలేదు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు దీన్ దయాళ్ దీప్ భార్య అయిన ఆర్మీ కెప్టెన్ రేణు తన్వర్ కూడా సరిగ్గా అదే రోజు రాత్రి తన తల్లి కౌశల్యకు వైద్య చికిత్స కోసం సోదరుడు సుమిత్‌తో కలిసి అక్టోబర్ 14న ఢిల్లీ చేరుకుంది. ఆర్మీ కంటోన్మెంట్ గెస్ట్ హౌస్‌లో వారు బస చేశారు. అక్కడి నుంచి తల్లి, సోదరుడు ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లగా.. కంటోన్మెంట్ గెస్ట్ హౌస్‌లో ఒంటరిగా ఉన్న రేణు తన్వర్ ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. తనది, భర్త మృతదేహాలకు కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీనిపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీలో అధికారులైన భార్యాభర్తలు ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడటంపై ఢిల్లీ, ఆగ్రా పోలీసులకు ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆగ్రా సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) సూరజ్ కుమార్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. దీప్ ఆత్మహత్య గురించి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని అధికారులు తమకు సమాచారం అందించామన్నారు. దీప్ మంగళవారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో తన సహోద్యోగులతో జోకులు పేల్చుతూ సరదాగా మాట్లాడాడని, అతని ముఖంలో ఎలాంటి బాధ, ఆందోళన కనిపించలేదని తెలిపారు. ఆయన పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడక మృతి చెందినట్లు వచ్చింది. దిప్, ఆయన భార్య మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.