పుల్వామా దాడి వెనుక మసూద్ అజహర్, రవూఫ్ అస్ఘర్, ఎన్ఐఏ ఛార్జ్ షీట్
కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన దాడి వెనుక జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్, అతని సోదరుడు రవూఫ్ అస్ఘర్ ల కీలక పాత్రపై జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) 5 వేల పేజీల సుదీర్ఘమైన ఛార్జ్ షీట్ ను రూపొందించింది.
కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన దాడి వెనుక జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్, అతని సోదరుడు రవూఫ్ అస్ఘర్ ల కీలక పాత్రపై జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) 5 వేల పేజీల సుదీర్ఘమైన ఛార్జ్ షీట్ ను రూపొందించింది. దీన్ని జమ్మూలోని కోర్టుకు సమర్పించనుంది. పాకిస్తాన్ నుంచే ఈ అన్నదమ్ములు ఈ దాడికి ఎలా ప్లాన్ చేశారో ఈ ఛార్జ్ షీట్ వివరించింది. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు మరణించారు. జైషే మహమ్మద్ కుట్రదారులు, ఉగ్రవాదులతో సహా పలువురు నిందితుల పేర్లను ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
పాక్ లోని జైషే కమాండర్ ఉమర్ ఫరూక్ ఫోన్ ద్వారా తన సహచరులతో సాగించిన సంభాషణలు, ఆర్ డీ ఎక్స్, ఇతర పేలుడు పదార్థాలను ఎలా రవాణా చేశాడు, అతని వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డింగులను కూడా ఈ సుదీర్ఘ ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. పుల్వామా దాడి అనంతరం భద్రతా దళాల కాల్పుల్లో ఉమర్ ఫరూక్ మరణించాడు. ఈ ఎటాక్ అనంతరం మసూద్ అజహర్ తన అనుచరులను ప్రశంసించిన తీరు కూడా ఇందులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇంకా ఈ దాడి వెనుక కీలక సూత్రధారులైన షకీర్ బషీర్ మేగే, మహ్మద్ ఇక్బల్, బిలాల్ అహ్మద్ వంటి వారిపేర్లు కూడా ఇందులో ఉన్నాయి.