భార్యను సైకిల్‌పై హాస్పిటల్‌కు తీసుకెళ్లిన భర్త

భార్యపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి తాజ్‌మహలే కట్టనక్కర్లేదు.. ప్రేమ అనునిత్యం తాజాగా వాడిపోకుండా చూసుకుంటే చాలు.. అరివళగన్‌ ప్రేమ అలాంటిదే! సహచరి మీద ఎంత ప్రేముంటే కేన్సర్‌తో బాధపడుతున్న ఆమెను సైకిల్‌పై ఎక్కించుకుని 120 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తీసుకెళతాడు..!

భార్యను సైకిల్‌పై  హాస్పిటల్‌కు తీసుకెళ్లిన భర్త
Follow us
Balu

|

Updated on: Aug 25, 2020 | 1:26 PM

భార్యపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి తాజ్‌మహలే కట్టనక్కర్లేదు.. ప్రేమ అనునిత్యం తాజాగా వాడిపోకుండా చూసుకుంటే చాలు.. అరివళగన్‌ ప్రేమ అలాంటిదే! సహచరి మీద ఎంత ప్రేముంటే కేన్సర్‌తో బాధపడుతున్న ఆమెను సైకిల్‌పై ఎక్కించుకుని 120 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తీసుకెళతాడు..! తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం దగ్గరలో మనల్‌మేడు అనే ఊరుంది.. ఆ ఊళ్లోనే 60 ఏళ్ల అరివళగన్‌ ఉంటున్నాడు.. మొదటి భార్య చనిపోవడంతో మంజుల అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. వీరిద్దరికి ఓ కుమారుడు! వీరి ఆనందాన్ని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో! మంజులకు కేన్సర్‌ అనే వ్యాధిని అంటగట్టింది.. తొమ్మిది నెలల క్రితం కేన్సర్‌ వ్యాధి సోకినట్టు గమనించి వెంటనే పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆసుపత్రికి తరలించారు.. అక్కడే ఆమె చికిత్స పొందుతూ వచ్చారు.. అయితే మార్చి 24 నుంచి దేశంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆమె ఆసుపత్రికి వెళ్లలేకపోయారు. వ్యాధితో తల్లడిల్లిపోతున్న ఆమెను చూడలేకపోయాడు అరివళగన్‌.. మార్చి 29న తనకున్న పాత సైకిల్‌పై ఆమెను కూర్చోబెట్టుకుని జిప్మర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కుంభకోణం నుంచి జిప్మర్‌ ఆసుపత్రి కనీసం 120 కిలోమీటర్లు ఉంటుంది.. కొన్ని రోజుల ట్రీట్‌మెంట్‌ తర్వాత అంబులెన్స్‌లో ఆమెను ఇంటికి తీసుకొచ్చారు అరివళగన్‌.. మొన్న ఆదివారం కేన్సర్‌ భూతం ఆమెను మింగేసింది.. భార్యను కాపాడుకునేందుకు ఎంతగా కష్టపడినా పైవాడు దయచూపలేదు.. భార్య ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయానే అంటూ కన్నీరుమున్నీరవుతున్న అరివళగన్‌ను ఓదార్చడం గ్రామస్తుల వల్ల కూడా కావడం లేదు.. మంజుల మరణం ఊళ్లోవాళ్లందరినీ కలచివేసింది..