Manipur violence: మణిపూర్‌లో ఆగని అల్లర్లు.. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి విద్యార్ధులు

మణిపూర్‌లో హింస యథేచ్ఛగా కొనసాగుతోంది. విద్యార్ధుల చలో రాజ్‌భవన్‌ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌పై ఐదు రోజుల పాటు నిషేధం విధించారు.

Manipur violence: మణిపూర్‌లో ఆగని అల్లర్లు.. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి విద్యార్ధులు
Manipur Violence
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 10, 2024 | 9:09 PM

మణిపూర్‌లో హింస యథేచ్ఛగా కొనసాగుతోంది. విద్యార్ధుల చలో రాజ్‌భవన్‌ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌పై ఐదు రోజుల పాటు నిషేధం విధించారు.

మణిపూర్‌ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. వరుసగా రెండో రోజు ఇంఫాల్‌లో రాజ్‌భవన్‌ను ముట్టడించడానికి విద్యార్ధి సంఘాలు ప్రయత్నించాయి. బారికేడ్లు తొలగించి విద్యార్దులు ముందుకు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. విద్యార్ధులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు..

విద్యార్దుల పైకి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. వందలాది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలో శాంతి నెలకొనాలని , తమ విద్యా సంవత్సరం నాశనం కాకుండా చూడాలని విద్యార్ధులు నినాదాలు చేశారు. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా ఉన్న భద్రతా సలహాదారును వెంటనే తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

గత వారం రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంఫాల్‌ వెస్ట్‌ , ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. అయినప్పటికి నిషేధాజ్ఞలు ఉల్లంఘించి విద్యార్ధులు ర్యాలీ తీశారు. రాజ్‌భవన్‌ దగ్గర పరిస్థితి అదుపు తప్పంది. అల్లరిమూకలు కొన్ని వాహనాలకు నిప్పు పెట్టాయి. తాజా అల్లర్ల కారణంగా మణిపూర్‌లో ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. ఇంటర్నెట్‌పై ఐదు రోజుల పాటు బ్యాన్‌ విధించారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధి సంఘాల నేతలగో గవర్నర్‌ చర్చలు జరిపారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి అన్ని చర్యలు తీసుకుంటామని విద్యార్ధులకు హామీ ఇచ్చారు.

సెప్టెంబర్ 15వ తేదీ వరకు రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు, హేట్ స్పీచ్‌లు షేర్ చేయకుండా ఉండేందుకే ఇంటర్నెట్‌ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒకవేళ నిరసనలు ఆగకపోతే సెలవులను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

మణిపూర్‌లో కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలు.. మైదాన ప్రాంతాల్లో నివసించే మెయితీలకు మధ్య తలెత్తిన వివాదంతో ఆ రాష్ట్రం గత ఏడాది కాలంగా హింసతో అట్టుడికిపోతోంది. ఇప్పటివరకు 220 మంది ఈ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయారు. గతేడాది మే నెలలో ప్రారంభమైన ఈ ఘర్షణలు, దాడులు.. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. సీఎం బీరెన్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మెయితీల పక్షం వహిస్తూ కుకీల అణచివేతకు పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..