లలితా జువెల్లరీ కేసు.. ‘ సినిమాకూ ‘ లింకు !
తమిళనాడు తిరుచ్చిరాపల్లి జిల్లాలో జరిగిన లలితాజువెల్లరీ కేసు మలుపులమీద మలుపులు తిరుగుతోంది. ఈ జువెల్లరీ నుంచి రూ. 13 కోట్ల విలువైన నగలను దోపిడీ దొంగలు దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో 32 ఏళ్ళ మణికందన్ అనే దొంగను పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా ఇతగాడు దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతూ వచ్చాడని వారు చెబుతున్నారు. తిరుఛ్చిరాపల్లిలోనే నివసించే మణికందన్.. తిరువరూర్ సమీపంలో ఓ చెక్ పోస్టును తప్పించుకుని పారిపోబోతూ ఖాకీలకు దొరికిపోయాడు. ఇతడి […]
తమిళనాడు తిరుచ్చిరాపల్లి జిల్లాలో జరిగిన లలితాజువెల్లరీ కేసు మలుపులమీద మలుపులు తిరుగుతోంది. ఈ జువెల్లరీ నుంచి రూ. 13 కోట్ల విలువైన నగలను దోపిడీ దొంగలు దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో 32 ఏళ్ళ మణికందన్ అనే దొంగను పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా ఇతగాడు దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతూ వచ్చాడని వారు చెబుతున్నారు. తిరుఛ్చిరాపల్లిలోనే నివసించే మణికందన్.. తిరువరూర్ సమీపంలో ఓ చెక్ పోస్టును తప్పించుకుని పారిపోబోతూ ఖాకీలకు దొరికిపోయాడు. ఇతడి నుంచి సుమారు అయిదు కేజీల నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జువెల్లరీ నుంచి దొంగిలించిన ఆభరణాలతో వీటి బార్ కోడ్స్ మ్యాచ్ అయ్యాయని వారు తెలిపారు. మూడంతస్థుల ఈ స్టోర్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంచిన నగల గదిలో ఇద్దరు దొంగలు ముఖాలకు మాస్కులు ధరించి ప్రవేశించి.. ఆ నగలను చోరీ చేసిన సీసీటీవీ ఫుటేజీ ఖాకీలకు లభ్యమైంది. అయిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ స్టోర్ పక్కనే ఓ పాఠశాల ఉంది. ఈ స్కూలు బిల్డింగ్ ద్వారా ఈ జువెల్లరీకి దారి తీసే గోడను ఎక్కి దొంగలు ప్రవేశించారు. తెల్లవారు జామున రెండు-మూడు గంటల మధ్యలో వీరిద్దరూ గోడకు రంధ్రం చేసి ఎంటరయ్యారని, చోరీ స్పాట్ ప్రాంతంలో మిర్చి పొడిని చల్లారని, పైగా తమ వేలిముద్రలు దొరక్కుండా చేతులకు గ్లోవ్స్ ధరించారని పోలీసులు వివరించారు. ఈ చోరీలో తమ మధ్య వాటాలు ఉన్నాయని మణికందన్ ఒప్పుకున్నట్టు తెలిసింది.
అటు-ఇతని సహచరుడు సురేష్ ఇంకా పరారీలో ఉన్నాడు. బడా స్మగ్లర్ అయిన మురుగన్ కు సురేష్ అల్లుడని తెలుస్తోంది. తనను తిరువరూర్ మురుగన్ అని కూడా పిలిపించుకునే మురుగన్.పై గతంలో సుమారు 150 చోరీ కేసులుకూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఒకప్పుడు ఇతగాడు రెండు తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడట. ‘ బాల మురుగన్ ప్రొడక్షన్స్ ‘ పేరిట ‘ మనసా వినవే ‘, అనే మూవీని తీశాడని, 2016 ఫిబ్రవరిలో ఓ చోరీ కేసులో పోలీసులకు పట్టుబడి… జైలు నుంచి విడుదలయ్యాక.. మళ్ళీ ‘ ఆత్మ ‘ అనే చిత్రం నిర్మించాడని తెలుస్తోంది. మామ మురుగన్ తీసిన చిత్రాల్లో సురేష్ కూడా నటించాడట. ఇక ఇతనికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. సురేష్ ఓ సినీ నటిని తనతో బాటు విదేశాలకు తీసుకువెళ్లాడని చెబుతున్నారు. లలితా జువెల్లరీలో దోపిడీ అనంతరం.. ఇతడు ఆ నటిని శీలంకకు తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అతడికోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. మొత్తానికి ఈ ఘరానా చోరీ కేసుకు, సినిమాలకూ ‘ లింకు ‘ ఉండడమే విశేషం.