AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. ఎస్‌ఐని కారుతో ఢీకొట్టి.. 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుల్..!

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. సబ్ ఇన్‌స్పెక్టర్ హత్య సంచలనం సృష్టించింది. ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రేమికుడితో కలిసి తన కారుతో సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ఢీకొట్టి, 30 మీటర్లు ఈడ్చుకెళ్లింది.

దారుణం.. ఎస్‌ఐని కారుతో ఢీకొట్టి.. 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుల్..!
Si Murder
Balaraju Goud
|

Updated on: Sep 11, 2024 | 7:48 PM

Share

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. సబ్ ఇన్‌స్పెక్టర్ హత్య సంచలనం సృష్టించింది. ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రేమికుడితో కలిసి తన కారుతో సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ఢీకొట్టి, 30 మీటర్లు ఈడ్చుకెళ్లింది. జాతీయ రహదారిపై మహిళా కానిస్టేబుల్ ఈ హత్యకు పాల్పడింది. చనిపోయిన సబ్ ఇన్‌స్పెక్టర్‌ను దీపాంకర్ గౌతమ్‌గా గుర్తించారు. దీపాంకర్‌ రాజ్‌గఢ్ పోలీస్ లైన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ హత్యకు పాల్పడినవారు మరెవరో కాదు, పచోర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పల్లవి సోలంకి, ఆమె ప్రియుడు కరణ్ ఠాకూర్‌.

ట్రయాంగిల్ ప్రేమలో మహిళా కానిస్టేబుల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మహిళా కానిస్టేబుల్, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తన ప్రియుడితో కలిసి, ఎస్‌ఐ దీపాంకర్ గౌతమ్‌ను తన కారుతో ఢీకొట్టింది. అనంతరం వారిద్దరూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారు పచోర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పల్లవి సోలంకికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. నేరం చేసిన తర్వాత, పల్లవి, ఆమె ప్రియుడు కరణ్ దేహత్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.

పల్లవి ఆమె ప్రియుడు కరణ్ మొదట ఏదో ఒక సాకుతో జాతీయ జాతీయ రహదారిపై ఎస్ఐ దీపాంకర్ గౌతమ్‌ను పిలిచారు. ఆపై అతను వెళ్ళడానికి బైక్‌పై కూర్చున్నప్పుడు, బైక్‌ను వెనుక నుండి కారుతో ఢీకొట్టారు. వారిద్దరూ దీపాంకర్‌ బైక్‌ను ఢీకొట్టి కారు కింద నుజ్జునుజ్జు చేసి బైక్‌తో పాటు దీపాంకర్‌ మృతదేహాన్ని 30 మీటర్లు ఈడ్చుకెళ్లారు.

ఈ దారుణానికి పాల్పడ్డ తర్వాత, పల్లవి ఆమె ప్రియుడు కరణ్ ఠాకూర్ దేహత్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మొత్తం సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆదిత్య మిశ్రా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. లేడీ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో, పల్లవి, కరణ్ కలిసి దారుణానికి పాల్పడ్డట్లు అంగీకరించారు.

ఇదిలావుండగా, బియోరా దేహత్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో SI దీపాంకర్ గౌతమ్, లేడీ కానిస్టేబుల్ పల్లవి దగ్గరయ్యారు. కానీ పల్లవి జీవితంలోకి కరణ్ అనుహ్యంగా ఏంట్రీ అయ్యాడు. ఆ తర్వాత ఆమె అతనితో సహా జీవనం ప్రారంభించింది. ఇది దీపాంకర్‌కు అస్సలు నచ్చలేదు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా మారుతున్న ఎస్‌ఐ దీపాంకర్‌ గౌతమ్‌ను తొలగించేందుకు పల్లవి పథకం పన్నినట్లు సమాచారం. ఈ విషయమై స్పందించిన రాజ్‌గఢ్ ఎస్పీ ఆదిత్య మిశ్రా.. ఇది ప్రమాదం కాదని, హత్య అని స్పష్టం చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..