Telangana Congress: ఏఐసీసీకి అల్టిమేటం.. కాంగ్రెస్ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మాదిగ జేఏసీ నిరసన సెగ
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ వేదికగా.. ఏఐసీసీకి అల్టిమేటం ఇచ్చాయి తెలంగాణకు చెందిన మాదిగ దండోరా, మాదిగ జేఏసీ. ఆ రెండు స్థానాలను మాదిగ వర్గానికే ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఆల్ ఆఫ్ సడెన్‌గా మాదిగ సామాజికవర్గం నుంచి నిరసన సెగ తగలడం.. కాంగ్రెస్ పెద్దల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతకీ మాదిగ జేఏసీ కోరుకుంటున్న ఆ రెండు స్థానాలేంటి?
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ వేదికగా.. ఏఐసీసీకి అల్టిమేటం ఇచ్చాయి తెలంగాణకు చెందిన మాదిగ దండోరా, మాదిగ జేఏసీ. ఆ రెండు స్థానాలను మాదిగ వర్గానికే ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఆల్ ఆఫ్ సడెన్‌గా మాదిగ సామాజికవర్గం నుంచి నిరసన సెగ తగలడం.. కాంగ్రెస్ పెద్దల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతకీ మాదిగ జేఏసీ కోరుకుంటున్న ఆ రెండు స్థానాలేంటి?
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ విడతల వారీగా అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. తెలంగాణలో ఇప్పటిదాకా ప్రకటించిన జాబితాల్లో 13మంది అభ్యర్థులను ఖరారు చేశారు. నాలుగు స్థానాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ సెగ్మెంట్‌లో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయన్న చర్చ కంటే.. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు చిచ్చు రాజేస్తోంది.
పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి, వరంగల్ స్థానాలను మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాదిగ దండోరా, మాదిగ జేఏసీల ఆధ్వర్యంలో ఢిల్లీలో చలో ఏఐసీసీ కార్యాలయం పేరుతో నిరసనకు దిగారు. మాదిగ దండోరా జేఏసీ నాయకులు ప్లకార్డులు చేతబూని ఎంపీ టికెట్లు కేటాయించాలని నినదించారు. ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్‌ను కుదిపేస్తోంది.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లలో 3 ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆ రెండు స్థానాలను మాల వర్గానికి చెందిన నేతలకు ఇవ్వడాన్ని మాదిగ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా పెద్దపల్లి సీటును గడ్డం వంశీకి కేటాయించడాన్ని తప్పుబడుతున్నారు. ఒకే కుటుంబానికి ఎన్ని సీట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో ఉండి కష్టపడుతున్న వారిని కాదని, మూడు నెలల క్రితం పార్టీలో చేరిన వివేక్ కుటుంబానికి ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారని నిలదీస్తున్నారు. వెంటనే గడ్డం వంశీని తప్పించి గజ్జెల కాంతానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అటు వరంగల్ లోక్‌సభ అభ్యర్థితో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల అభ్యర్థిగా మాదిగ వర్గం నేతలకే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కంటోన్మెంట్ సీటును పిడమర్తి రవికి ఇవ్వాలంటున్నారు. వరంగల్ సీటులో మాదిగ వర్గం నేత ఎవరికిచ్చినా తమకు అభ్యంతరం లేదంటున్నారు. తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని.. అధిష్ఠానానికి తమ అభిమతం తెలిపేందుకు ఢిల్లీ వచ్చామంటున్నారు.
తెలంగాణలో 80లక్షల జనాభా కలిగిన మాదిగలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తూ కేవలం ఓకే కుటుంబానికి చెందిన వారికి రాజకీయంగా అవకాశాలు ఇవ్వడమంటే యావత్తు మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాదిగ దండోరా, మాదిగ జేఏసీ సభ్యులు. ఎన్నో సంవత్సరాలుగా మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చారని, అలాంటి మాదిగలను విస్మరించడం సరికాదంటున్నారు. ఇప్పటికైనా టికెట్ల కోటాలో అధిష్ఠానం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మొత్తానికి కోటా ఫైట్ నిరసనలు ఢిల్లీకి చేరడం.. కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…