Lok Sabha Elections 2024: క్లైమాక్స్‌కు చేరిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై రాహుల్ ఏమన్నారంటే..

|

May 28, 2024 | 7:22 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరగనుండటంతో ప్రధానపార్టీలన్నీ స్పీడును పెంచాయి. వరుస సభలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ బెంగాల్‌లో, అమిత్‌షా ఒడిశాలో ప్రచారం చేశారు. యూపీలో రాహుల్‌ , హిమాచల్‌లో ప్రియాంక ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.

Lok Sabha Elections 2024: క్లైమాక్స్‌కు చేరిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై రాహుల్ ఏమన్నారంటే..
Pm Modi Rahul Gandhi
Follow us on

లోక్‌సభ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరగనుండటంతో ప్రధానపార్టీలన్నీ స్పీడును పెంచాయి. వరుస సభలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో సుడిగాలి ప్రచారం చేశారు. జాదవ్‌పూర్‌తో పాటు పలు సభల్లో పాల్గొన్నారు. అవినీతి విషయంలో తాము ఏ మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలను తప్పుబట్టారు. ఆ ఆరోపణలు చేసేవాళ్లు ముందు రాజ్యాంగాన్ని, దేశంలోని చట్టాలని చదవాలని ప్రధాని సూచించారు. ఎవరు జైలుకెళ్లాలన్నది ప్రధాని నిర్ణయిస్తారన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే మార్గంలో భారతదేశం ప్రస్తుతం ప్రయాణిస్తోందని మోదీ అన్నారు. దానికి పునాదులు తూర్పు భారతదేశంలో ఉన్నాయని తెలిపారు. తూర్పు భారతదేశంలో గడిచిన 10 పదేళ్లలో కేంద్ర ప్రభుచ్వం చేసిన ఖర్చు గడిచిన 60-70 ఏళ్లలో ఎన్నడూ చేయలేదని మోదీ అన్నారు.

కాగా.. ఒడిశాలో కూడా ఎన్నికల ప్రచారం వేడెక్కింది. లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీదే ఘనవిజయం అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా . భద్రక్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అమిత్‌షా . ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్‌షా . ఒడిశా సీఎం పగ్గాలను ఓ తమిళ వ్యక్తికి కట్టబెట్టేందుకు నవీన్‌ పట్నాయక్‌ కుట్ర చేస్తున్నారని విమర్శించారు అమిత్‌షా . తాము అధికారం లోకి వస్తే ఒడిశా భూమి పుత్రుడినే సీఎం చేస్తామన్నారు. ఒడిశా ప్రజల ఆత్మాభిమానాన్ని నవీన్‌ పట్నాయక్‌ దెబ్బ తీస్తున్నారని విమర్శించారు.

ఇదిలాఉంటే.. అవతార పురుషుడినంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. అదానీ, అంబానీకి సాయపడమని పరమాత్ముడు ఆయనను పంపించారని అన్నారు. నిజంగా ఆయనను ఆ పరమాత్ముడు పంపించి ఉంటే కచ్చితంగా ఆయన పేదలు, రైతులకు సాయపడి ఉండేవారని రాహుల్‌ అన్నారు. యూపీలో అఖిలేశ్‌తో కలిసి ప్రచారం చేశారు రాహుల్‌గాంధీ.

హిమాచల్‌ప్రదేశ్‌ లోని సర్సార్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు ప్రియాంకాగాంధీ. హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సుక్కు కూడా ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు. హిమాచల్‌ ప్రజలకు కేంద్రం తీరని అన్యాయం చేసిందన్నారు ప్రియాంక. వరదలతో తల్లడిల్లిన రాష్ట్రానికి కేంద్రం రిక్తహస్తం చూపించిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు ప్రియాంక గాంధీ..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..