పాట్న, మే 16: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 దశలు పూర్తికాగా ఇంకా 3 దశలు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో బీహార్‌లో జరగనున్న ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. బీహార్ ఎన్నికల్లో భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ బరిలో నిలిచారు. కరాకట్ నియోజకవర్గం నుంచి పవన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు నటుడు పవన్ తల్లి ప్రతిమా దేవి కూడా తన కుమారుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న కరాకత్ లోక్‌సభ స్థానానికే నామినేషన్ దాఖలు చేయడం చర్చణీయాంశంగా మారింది. ఈ మేరకు ఆమె మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే దీనిపై నటుడు పవన్‌సింగ్ గానీ, అతని తల్లి ప్రతిమా దేవిగానీ మీడియా ద్వారా ఎటువంటి ప్రకటన చేయలేదు.
రాష్ట్రీయ లోక్‌మోర్చా సారథ్యంలోని మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా కరకాట్‌లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇదే స్థానం నుంచి ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘటబంధన్ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి రాజారామ్ సింగ్‌ను పోటీకి దింపింది. అయితే తన కుమారుడు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉండటంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏకంగా కొడుకుతో ఢీకొనేందుకే ఆమె పోటీ చేస్తున్నారని మరొక ప్రచారం కూడా జోరందుకుంది. దీంతో తల్లీ కొడుకులిద్దరూ ఒకే స్థానంలో బరిలో ఉండటంలో అక్కడి ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలున్నాయి.
కాగా ఈ స్థానంలో జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ మే 17. ఈ ఎన్నికల్లో బెంగాల్‌లోని అసన్‌సోల్ బీజేపీ టికెట్‌ను తిరస్కరించిన పవన్ సింగ్ తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించి, ఆ మేరకు నామినేషన్ వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.