Lakhimpur Tension: లఖీంపూర్‌లో హైటెన్షన్.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో అజయ్‌మిశ్రా భేటీ.. బాధితుల పరామర్శకు రాహుల్
ఢిల్లీ చేరుకున్న అజయ్‌మిశ్రా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అజయ్ మిశ్రా రాజీనామా చేస్తారా ? లేదా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Minister Ajay Mishra meets Amit Shah: లఖీంపూర్‌లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుందోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లి నలుగురు రైతులు చనిపోయినట్టు ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. కేంద్ర మంత్రి కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను ఆందోళనకారులు కొట్టి చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. కారు తనదే అని , కాని తన కుమారుడు డ్రైవింగ్ చేయలేదంటున్నారు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా. ఈ ఘటన జరిగినప్పుడు తాము లఖీంపూర్‌లో లేమని ఆయన చెబుతున్నారు. ఢిల్లీ చేరుకున్న అజయ్‌మిశ్రా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అజయ్ మిశ్రా రాజీనామా చేస్తారా ? లేదా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడ్ని అరెస్ట్ చేయాలని రైతులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా బుధవారం ఉదయం ఢిల్లీ నార్త్ బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జరిగిన ఘటనపై వివరించారు. రైతులపైకి దూసుకెళ్లి ఇద్దరి మరణానికి కారణమైన వాహనంలో తన కుమారుడు లేడని ఇప్పటికే పలు మార్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని అమిత్ షాకు ఆయన చెప్పినట్లు తెలుస్తో్ంది.
అయితే, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను బీజేపీ హైకమాండ్ వెనకేసుకొస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో నియంత పాలన నడుస్తోందని , లఖీంపూర్‌కు విపక్ష నేతలు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. మరోవైపు లఖీంపూర్ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగితో ఫోన్లో మాట్లాడారు మోదీ. శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశించారు. మరోవైపు, తీవ్ర ఉద్రిక్తత మధ్య రాహుల్, ప్రియాంకాగాంధీ లఖీంపూర్ పర్యటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీతాపూర్ గెస్ట్‌హౌజ్ నుంచి ప్రియాంకను విడుదల చేశారు పోలీసులు. రెండు రోజుల క్రితం ప్రియాంక లఖీంపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వని యూపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయాన్ని మార్చుకుంది.
ఇదిలావుంటే, తన రాజీనామా కోసం ఎలాంటి ఒత్తిడి లేదని అజయ్ మిశ్రా మీడియాతో మంగళవారం అన్నారు. నేనెందుకు రాజీనామా చేయాలి? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఆదివారం లఖింపూర్ ఖేరీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న అజయ్ మిశ్రా కాన్వాయ్‌లోని వాహనం రైతులపై దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన అల్లర్లలో 8 మంది మరణించారు. మృతుల్లో నలుగురు రైతులున్నారు. ఈ ఘటన నేపథ్యంలో లఖింపూర్ ఖేరీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Delhi: Union Ministers Ajay Mishra Teni and Nityanand Rai arrive in North Block pic.twitter.com/YUWxwDK5eV
— ANI (@ANI) October 6, 2021