Krishna Janmashtami 2022: దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులు ఎక్కడికక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ‘గోవిందా అలా రే అలా, జరా మత్కీ సంభాల్ బ్రిజ్బాలా’.. అంటూ ఉట్టి కొట్టేందుకు భక్తులు గోవిందులను ఆహ్వానిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు దేశ ప్రజలు ఈ ఉట్ల పండుగను ఘనంగా జరుపుకోలేకపోయారు. ప్రస్తుతం అంతా సెట్ అవడం, ప్రభుత్వాలు కూడా నిషేధాజ్ఞలు ఎత్తివేయడంతో ఈసారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రజలు. జన్మాష్టమిని పురస్కరించుకుని ఉట్ల పండుగను ఘనంగా నిర్వహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం.. కొవిడ్ నిబంధనలన్నింటినీ ఎత్తివేసింది.
గోవిందులకు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం..
మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ‘దహీ హండి'(ఉట్టి)కి అడ్వేంచర్ స్పోర్ట్స్ హోదాను కల్పించాలని డిసైడ్ అయ్యింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే దహీ హండి ఈవెంట్‌లలో పాల్గొనే యువకులను గోవిందులు అని పిలుస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దహీ హండీ ఈవెంట్‌లో విజేతకు అడ్వేంచర్ స్పోర్ట్స్ ట్యాగ్, స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమించడం జరుగుతుంది. అలాగే, దహీ హండీలో మానవ పిరమిడ్‌ల ఏర్పాటు సమయంలో ఆటగాళ్లకు ప్రాణాంతకమైన, ఇతర గాయాలైనప్పుడు బాధితులకు గానీ, బాధితుల కుటుంబాలకు గానీ పరిహారం అందివ్వడం జరుగుతుంది.
రూ. 55 లక్షలు, స్పెయిన్ టికెట్..
కృష్ణాష్టమి వేళ దహీ హండీ ఈవెంట్ నిర్వాహకులు భారీగా బహుమతులు ప్రకటిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో గెలిచిన వారికి రూ. 1.11 లక్షల నుంచి రూ. 55 లక్షల మధ్య బహుమతి ఇస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎక్కువగా ఈ ప్రైజ్‌లు ప్రకటిస్తున్నాయి. నేడు కృష్ణాష్టమి సందర్భంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) నిర్వహిస్తున్న దహీ హండి ఈవెంట్‌కు మొత్తం రూ. 55 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించింది. అంతేకాదు.. విజేత జట్టుకు స్పెయిన్ ట్రిప్ అవకాశం కూడా ప్రకటించింది. ఇక థానే శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సంస్థ నిర్వహించి దహీ హండీ ఈవెంట్‌లో మొత్తం రూ.21 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు. స్థానిక సంస్థ స్వామి ప్రతిష్ఠాన్ విజేత జట్టుకు రూ. 11 లక్షలతో సహా మొత్తం రూ. 51 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించింది. కాగా, ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు ముంబై పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, ఆంబులెన్స్‌లు, ఆస్పత్రులలో బెడ్‌లను రిజర్వ్ చేసి సిద్ధంగా ఉంచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..