మానసిక సమస్యలతో ఐటీ ఉద్యోగి మృతి.. ఇన్ స్టా పోస్ట్‌లో అతని ఆవేదన చదివితే…
తిరువనంతపురంలోని తంపనూర్‌లోని ఒక లాడ్జ్ గదిలో 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆనందు అజి గురువారం ఆత్మహత్య చేసుకుని కనిపించారు. అయితే అతను ఇన్ స్టాలో షెడ్యూల్ చేసిన పోస్ట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు ఉన్నాయి. తాను ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు గురయినట్లు అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

తిరువనంతపురంలోని తంపనూర్ ప్రాంతంలో గురువారం ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. 26 ఏళ్ల అనందు అజి అనే వ్యక్తి లాడ్జి గదిలో ఉరేసుకుని మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. కట్టాయం జిల్లా థంపలకడకు చెందిన అనందు ఐటీ రంగంలో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం వరకు గది తలుపులు తెరవకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. గది తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అనందు ఉరేసుకున్న స్థితిలో కనబడ్డాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనందు ఆత్మహత్య చేసుకునే ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను షెడ్యూల్ చేశాడు. ఆ పోస్ట్‌లో తాను దీర్ఘకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, డిప్రెషన్, ఆందోళన వంటి రుగ్మతలు జీవితాన్ని నాశనం చేశాయని పేర్కొన్నాడు. “అమ్మాయి లేదా అప్పుల కారణంగా నేను ఆత్మహత్య చేసుకోవడం లేదు. నా మానసిక వ్యాధులు, ఆందోళన, మందుల వల్ల వచ్చిన అసహనం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని రాశాడు.
అయితే అతని లేఖలో చేసిన ఆరోపణలు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చిన్ననాటి నుంచే తాను ఓ జాతీయ వాద సంస్థ సభ్యుడిగా ఉన్నానని.. అదే తన జీవితంలో మానసిక గాయాలకు కారణమైందని.. అక్కడే తాను లైంగిక, శారీరక దాడులకు గురయ్యానని వెల్లడించాడు. “నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ శిబిరాల్లో కొందరు నాపై లైంగిక దాడులు చేశారు. వారెవరో నాకు తెలియదు కానీ నేను అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేను. నా మానసిక సంఘర్షణ అక్కడే ప్రారంభమైందని” అని లేఖలో పేర్కొన్నాడు. తనపై మొదట దాడి చేసిన వ్యక్తి ‘ఎన్‌ఎం’ అనే పేరుతో ఉన్న ఆ సంస్థకు చెందిన కార్యకర్త అని.. ఆయన తన ఇంటికి సమీపంలోని నివశిస్తాడని రాసుకొచ్చాడు. “తను నాపై అనేకసార్లు లైంగిక దాడులు చేశాడు. నేను చిన్నపిల్లాడిని. నా కుటుంబం అతనిని బంధువులా భావించింది. కానీ నా జీవితం మొత్తాన్నీ అతనే నాశనం చేశాడు” అని అతను తన ఆవేదనను వెలిబుచ్చాడు.
తల్లిదండ్రులు పిల్లలకు సరైన లైంగిక విద్య ఇవ్వాలని, మంచి-చెడు స్పర్శ గురించి అవగాహన కల్పించాలని కూడా లేఖలో సూచించాడు. పిల్లలు భయంతో మాట్లాడలేకపోవచ్చు. తల్లిదండ్రులు వారితో బంధాన్ని పెంచుకుని, వారు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించాలని అతను సూచించాడు. తన చెల్లి నిర్ణయాల వల్ల తానీ నిర్ణయం తీసుకున్నానని ఎవరూ అనుకోవద్దని కూడా స్పష్టంచేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(గమనిక: ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు. మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకుని, మనుగడ సాగించడానికి ప్రయత్నించండి. హెల్ప్‌లైన్ నంబర్లు – 1056, 0471- 2552056)




