రాజకీయ పనులన్నీ పక్కన బెట్టండి, ప్రజలను ఆదుకోండి, పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ పిలుపు
ఈ సెకండ్ కోవిడ్ వేవ్ తరుణంలో తమ పార్టీ కార్యకర్తలంతా రాజకీయ కార్యక్రమాలను, పనులను పక్కన బెట్టాలని, కోవిడ్ రోగులకు, వారి బంధువులకు సాయపడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ....
ఈ సెకండ్ కోవిడ్ వేవ్ తరుణంలో తమ పార్టీ కార్యకర్తలంతా రాజకీయ కార్యక్రమాలను, పనులను పక్కన బెట్టాలని, కోవిడ్ రోగులకు, వారి బంధువులకు సాయపడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇది కాంగ్రెస్ కుటుంబ ధర్మం అని ట్వీట్ చేశారు. దేశానికి ఇప్పుడు బాధ్యతాయుతమైన వ్యక్తులు అవసరమని పేర్కొన్నారు. అసలు వ్యవస్థే విఫలమైందని ఆయన పరోక్షంగా కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందువల్లే పార్టీ కేడర్ తమకు తాముగా ముందుకు వచ్చి ప్రజల సేవలో పాల్గొనాలన్నారు. దేశంలో 3,49,691 కి కోవిడ్ కేసులు చేరుకోగా 24 గంటల్లో 2,767 మంది రోగులు మరణించారని రాహుల్ గుర్తు చేశారు. ఈ తరుణంలో ప్రజల బాధలను గమనించాలని, వారికీ అన్ని విధాలా సాయపడేందుకు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. వారికి సహాయపడే బాధ్యత మనపై ఉందన్నారు. బెంగాల్ ఎన్నికలు మూడో దశలో ఉండగానే రాహుల్ గాంధీ..అప్పటికే పెరిగిన కరోనా వైరస్ కేసుల దృష్ట్యా.. తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకున్నారు. కోవిడ్ ఇంకా పెరగకుండా తనీ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన రాహుల్ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు.
ఇక బెంగాల్ ఎన్నికలు ఇంకా రెండు దశల్లో జరగాలి ఉన్నాయి. ఈ నెల 26, 29 తేదీల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికల ర్యాలీలను, రోడ్ షో లు, పాదయాత్రలను ఈసీ నిషేధించింది. ఈ మిగిలిన ఎన్నికల సరళి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా తమ ప్రచార కార్యక్రమాలను కుదించుకున్నారు. మే 2 న ఎన్నికల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి.