AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Water Dispute: జూరాల వద్ద కృష్ణా నీటిని తరలించేందుకు కర్ణాటకం.. రాజుకుంటున్న మరో జలవివాదం!

తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య మరో జల వివాదం రాజుకుంటోంది. ముందస్తు సమాచారం లేకుండా కర్ణాటక ప్రభుత్వం కృష్ణా జలాల అదనపు వాడకానికి కొత్త ప్రాజెక్టును ప్రారంభించడంతో కొత్త జల వివాదం రెండు రాష్ట్రాల మధ్య మొదలైంది.

Krishna Water Dispute: జూరాల వద్ద కృష్ణా నీటిని తరలించేందుకు కర్ణాటకం.. రాజుకుంటున్న మరో జలవివాదం!
Jurala Project
Rajesh Sharma
| Edited By: KVD Varma|

Updated on: Apr 25, 2021 | 2:04 PM

Share

Krishna Water Dispute:  తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య మరో జల వివాదం రాజుకుంటోంది. ముందస్తు సమాచారం లేకుండా కర్ణాటక ప్రభుత్వం కృష్ణా జలాల అదనపు వాడకానికి కొత్త ప్రాజెక్టును ప్రారంభించడంతో కొత్త జల వివాదం రెండు రాష్ట్రాల మధ్య మొదలైంది. కర్ణాటకతో ఇదివరకే ఆల్మట్టి, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ వంటి అంశాలపై తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకే పలు వివాదాలు కోర్టు కేసులు దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నాయి.  తాజాగా, జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వినియోగం కోసం కర్ణాటక లోని రాయచూరు జిల్లా గంజి పల్లి వద్ద కొత్తగా పంప్ హౌస్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పంప్ హౌస్ నిర్మాణం కోసం 192 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ టెండర్లను కన్నడ ప్రభుత్వం పిలిచింది. భాగస్వామ్య రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, కృష్ణ రివర్ బోర్డ్ కు సమాచారం అందించకుండా కర్ణాటక ప్రభుత్వం గంజి పల్లి పంప్ హౌస్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించటంతో ఇరు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి తెరచింది.

కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండానే, తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ను అక్రమంగా వినియోగించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం టెండర్లు పిలిచి జల దోపిడీకి తెరలేపింది. ఈ విషయంపై  తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన గద్వాల శాసనసభ్యుడు కృష్ణ మోహన్ రెడ్డి తాజాగా ఆరోపణలు చేశారు. గద్వాలలో మీడియాతో మాట్లాడిన కృష్ణమోహన్ రెడ్డి, రాయచూరు జిల్లా గంజి పల్లి దగ్గర కృష్ణానదిపై వున్న జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 0.2 టిఎంసిల నీటిని వినియోగించు కోవడానికి 192 కోట్ల రూపాయలతో పంప్ హౌస్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం పూనుకుందని  వెల్లడించారు. పంప్ హౌస్ నిర్మాణం కోసం ఆన్లైన్లో టెండర్లు కూడా పిలిచారని ఆయన తెలిపారు. జూరాల బ్యాక్ వాటర్ ని కర్ణాటక మళ్లిస్తే, భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని కృష్ణమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాగు, తాగు నీటికి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు అవస్థల పాలు కాకతప్పదని కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వ జల దోపిడీపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని, ఈ విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కర్ణాటక ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పదని ఆయన హెచ్చరించారు.

నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలం నుంచీ, కర్ణాటకతో తెలుగు వారికి జల వివాదాలు ఉన్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఆ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడింది. కృష్ణాజిలాల్లో  కేటాయించిన దానికి మించి ఏ రాష్ట్రము వినియోగించుకో కూడదని ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. కృష్ణా జల వివాదాలపై శాశ్వత పరిష్కారం కోసం కృష్ణా నది నిర్వాహక బోర్డు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా గతంలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం ద్వారా కృష్ణా జలాలను అదనంగా వినియోగించుకోవడానికి అప్పట్లో కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం చర్యలకు పాల్పడుతోందని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయపోరాటం కూడా కొనసాగించింది. అయితే, ఒకవైపు న్యాయ వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేసింది.

తాజాగా మరోసారి తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన నీటిని తరలించుకుపోయేందుకు కర్ణాటక ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. అందుకోసమే కర్ణాటకలోని రాయచూరు జిల్లా పల్లి వద్ద కొత్తగా పంప్ హౌస్ నిర్మాణానికి కన్నడ ప్రభుత్వం పూనుకుంది. ఈ విషయంలో తక్షణమే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. కేంద్ర జోక్యాన్ని కోరడం ద్వారా తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణాజలాలను ఇంకెవరు తరలించుకు చూసుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి తక్షణం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సంప్రదింపుల ప్రక్రియను చేపట్టవలసిన అవసరం ఉందని సాగునీటి పారుదల శాఖ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: రాజకీయ పనులన్నీ పక్కన బెట్టండి, ప్రజలను ఆదుకోండి, పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ పిలుపు

రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. జలుబు, ఫ్లూను తగ్గించే టీ.. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా..