కమలం ఆశలు గల్లంతు..! 38 ఏళ్ల సాంప్రదాయాన్ని కొనసాగించిన కన్నడ ఓటర్లు..
ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపును పరిగణలోకి తీసుకుంటే బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. బీజేపీ సర్కారు కమిషన్ల ప్రభుత్వమని ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..
కర్ణాటక ఓటర్లు ఈ సారి కూడా తమ ఆనవాయితీని కొనసాగించారు. కర్ణాటక చరిత్రలో గత 38 ఏళ్లలో ఇప్పటి వరకు ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. చివరగా 1985లో రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో జేడీఎస్ వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీకి మళ్లీ అధికార పగ్గాలు ఇవ్వలేదు కన్నడ ఓటరు దేవుళ్లు. అయితే అధికార పగ్గాలు మళ్లీ సొంతం చేసుకుని.. 38 ఏళ్ల ఈ ఆనవాయితీకి బ్రేక్ వేస్తామని బీజేపీ నేతలు ఎన్నికల వేళ ధీమా వ్యక్తంచేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపును పరిగణలోకి తీసుకుంటే బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయని స్పష్టమవుతోంది. వరుసగా రెండో సారి అధికారంలోకి రావాలన్న కమలనాథుల ఆశలు అందని ద్రాక్షగానే మిగిలిపోనుంది. కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. బీజేపీ సర్కారు కమిషన్ల ప్రభుత్వమని ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అధికార పీఠం వైపు అడుగులు వేస్తోంది.
ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ (113)ను దాటేసింది. మొత్తం 224 స్థానాలతో కూడిన కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 75 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జేడీఎస్ 25 స్థానాలు, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరిన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వార్తలు చదవండి..