బీజేపీ vs కాంగ్రెస్.. బెంగళూరు తొక్కిసలాట విషాదంపై రాజకీయ రగడ.. సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు..
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై పొలిటికల్ పంచాయితీ మొదలైంది. ఇది ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే అని బీజేపీ విమర్శిస్తే.. కుంభమేళాను తాము రాజకీయం చేయలేదని గుర్తు చేశారు సీఎం సిద్ధరామయ్య. ఇలాంటి ఘటనలు అనేక చోట్ల జరిగాయని.. కానీ జరిగిన ఘటనను తాను సమర్థించడం లేదని స్పష్టం చేశారు.

బెంగళూరు తొక్కిసలాట విషాదంపై ఆ కర్నాటకలో రాజకీయ రగడ మొదలైంది. స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు. పోలీసులు ఈ సంబరాలకు అనుమతి ఇచ్చేందుకు అంగీకరించలేదని.. కానీ వారిపై ఒత్తిడి తీసుకొచ్చి అనుమతి ఇచ్చేలా చేశారని విమర్శించారు. పబ్లిసిటీ కంటే ప్రజల సెక్యూరిటీ ముఖ్యమనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని విజయేంద్ర పరామర్శించారు.
ప్రజలకు క్షమాపణలు చెప్పిన డీకే శివకుమార్
చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరగడంపై స్పందించారు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఈ ఘటనపై ఆయన ప్రజలను క్షమాపణలు కోరారు. విజయోత్సవ ర్యాలీకి భారీగా ప్రజలు హాజరయ్యారని.. వారిపై పోలీసులు ఎటువంటి లాఠీఛార్జ్ చేయలేదని తెలిపారు. ఘటన జరగడంతో కేవలం 10 నిమిషాల్లోనే ఈ కార్యక్రమాన్ని ముగించామన్నారు.
ఘటనపై రాజకీయం వద్దు: సిద్ధరామయ్య
అయితే విజయోత్సవాలకు ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని తాము ఊహించలేదని.. సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.. స్టేడియం సామర్థ్యం 35వేలు అయితే.. 2 లక్షల మందికి పైనే అభిమానులు తరలివచ్చారని తెలిపారు. ఘటనపై తాము రాజకీయం చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. కుంభమేళాలోనూ తొక్కిసలాట జరిగి అనేకమంది చనిపోయారని.. కానీ వాటిని తాము రాజకీయం చేయలేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు అనేక చోట్ల జరిగాయని.. కానీ జరిగిన ఘటనను తాను సమర్థించడం లేదని స్పష్టం చేశారు.
తొక్కిసలాట ఘటన జరిగిన రోజే ఈ అంశంపై పొలిటికల్ ఫైట్ మొదలుకావడంతో.. రాబోయే రోజుల్లో దీనిపై రాజకీయంగా ఇంకెంత రగడ జరుగుతుందో అనే చర్చ మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




