Leopard: ఝార్ఖండ్‌లో హడలెత్తిస్తున్న చిరుత.. మ్యాన్ ఈటర్ కోసం రంగంలోకి దిగిన హైదరాబాదీ..
ఝార్ఖండ్‌లో ఓ చిరుత హడలెత్తిస్తోంది. కంటపడిన మనుషులను చంపుతూ ఈ మ్యాన్ ఈటర్.. 50 గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ చిరుతను పట్టుకోవడానికి హైదరాబాదీ షూటర్..
ఝార్ఖండ్‌లో ఓ చిరుత హడలెత్తిస్తోంది. కంటపడిన మనుషులను చంపుతూ ఈ మ్యాన్ ఈటర్.. 50 గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ చిరుతను పట్టుకోవడానికి హైదరాబాదీ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఝార్ఖండ్ అటవీ శాఖ నవాబ్ సహాయం కోరింది.. మ్యాన్ ఈటర్లను పట్టుకోవడంలో దిట్టగా పేరుపొందిన నవాబ్ త్వరలోనే ఝార్ఖండ్‌కు చేరుకోనున్నారు. ఝార్ఖండ్‌లోని పలాము డివిజన్లో 50 గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మ్యాన్ ఈటర్. పాలము డివిజన్‌లో గత 20రోజుల్లో నలుగురు చిన్నారులను చిరుత చంపింది. దీంతో సాయంత్రమైతే చాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలుపులువేసుకుని ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ మ్యాన్ ఈటర్‌ను పట్టుకోవడానికి స్థానిక అటవీశాఖ నడుం బిగించింది. చిరుత కోసం జార్ఖండ్ అటవీ శాఖ 50కి పైగా ట్రాప్ కెమెరాలు, ఒక డ్రోన్ ను ఏర్పాటు చేసింది. దీంతోపాటు పెద్ద సంఖ్యలో అధికారులను మోహరించింది.
నవాబ్ షఫత్ అలీఖాన్ వద్ద అత్యాధునికమైన సామాగ్రి ఉన్నట్లు ఝార్ఖండ్ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ శశికర్ సమంత చెప్పారు. మత్తు ఇంజెక్షన్లు ఎక్కువగా ఇంజెక్ట్ చేసి చిరుతను బంధిస్తామంటున్న నవాబ్. నాలుగైదు రోజుల్లో పలాము డివిజన్లోకి నవాబ్ చేరుకుంటారని శశికర్ సమంత అంటున్నారు. అయితే, ఇప్పటివరకు ‘మాన్-ఈటర్’ చిరుతపులి జాడ లేదని.. దానిని బంధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇప్పటివరకు చిరుత దాడిలో గర్వాలో ముగ్గురు, లతేహర్ జిల్లాలో ఒకరు మరణించినట్లు పేర్కొంటున్నారు. బాధితులు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలని అధికారులు తెలిపారు. చిరుత భీభత్సంతో జిల్లాలోని రామ్‌కండ, రంకా, భండారియా అనే మూడు బ్లాక్‌లలోని 50 కి పైగా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రివేళ బయటకు వెళ్లొద్దంటూ అటవీ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..