జూన్ 16ను శ్రీశ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్‌నెస్ డేగా ప్రకటించిన మరో నగరం!
జాక్సన్‌విల్లే నగరం జూన్ 16ని శ్రీశ్రీ రవిశంకర్ శాంతి దినోత్సవంగా ప్రకటించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ గౌరవం అందించారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం జరుపుకుంటున్న 32వ నగరంగా జాక్సన్ విల్లే నిలిచింది.

భారతీయ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే జూన్ 16ని శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్‌నెస్ డేగా ప్రకటించింది. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జీవితకాల సేవను.. అవగాహన, ఐక్యత స్వస్థతను పెంపొందించడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను గుర్తిస్తూ ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది జూన్ 16ని శ్రీ శ్రీ రవిశంకర్ శాంతి దినోత్సవంగా అధికారికంగా జరపనున్నారు. నార్త్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ అధికారికంగా ప్రకటనను సమర్పించారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా శ్రీ శ్రీ రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన 32వ నగరంగా జాక్సన్‌విల్లే అవతరించింది.
ఎవరీ రవిశంకర్..?
రవిశంకర్ 1956 మే 13న తమిళనాడులో జన్మించారు. ఆయన భారతీయ ఆధ్యాత్మిక గురువుగా ప్రసిద్ధి చెందారు. అతన్ని “శ్రీశ్రీ” అని, గురూజీ అనీ, గురుదేవ్ అని పిలుస్తారు. 1981లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. అది ప్రజలకు సామాజిక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థ. 1997లో జెనీవాలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించారు. ఇది సహాయక చర్యలు, గ్రామీణాభివృద్ధిలో నిమగ్నమై ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శాఖలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రధాన శాఖ బెంగుళూరు సమీపంలోని జక్కూరు వద్ద ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి