AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: మరోసారి సత్తా చాటిన ఇస్రో.. GSLV F-17 ప్రయోగం సక్సెస్.. కక్ష్యలోకి EOS-05!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోట నుంచి శుక్రవారం తెల్లవారుజామున ప్రయోగించిన GSLV-F17 రాకెట్ ద్వారా 2,367 కేజీల EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ప్రయోగం ఇస్రోకు మరో కీలక విజయంగా నిలిచింది.

ISRO: మరోసారి సత్తా చాటిన ఇస్రో.. GSLV F-17 ప్రయోగం సక్సెస్.. కక్ష్యలోకి EOS-05!
Isro Gslv F17 Launch Successful
Shaik Madar Saheb
|

Updated on: Sep 04, 2026 | 6:48 AM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన GSLV F-17 ప్రయోగం విజయవంతమైంది.. శ్రీహరికోట నుంచి శుక్రవారం తెల్లవారుజామున.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా 2,367 కేజీల బరువున్న అత్యాధునిక ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. GSLV F-17 వాహకనౌక ద్వారా అడ్వాన్స్‌డ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టిందని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ వెల్లడించారు. ఉపగ్రహాన్ని 170 కి.మీ / 29,000 కి.మీ కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, రాకెట్‌ మరింత మెరుగైన పనితీరును కనబరిచి 171 కి.మీ / 31,026 కి.మీ కక్ష్యలోకి విజయవంతంగా చేర్చిందన్నారు. దేశ అవసరాల నిమిత్తం భూమిని నిశితంగా పరిశీలించేందుకు 36,000 కి.మీ.లు జియో సింక్రనస్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఉంచుతున్న మొట్టమొదటి ఉపగ్రహం ఇదే కావడం విశేషమని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీహరికోట నుంచి ఇది రెండో విజయవంతమైన ప్రయోగం.. మొదటిది స్కైరూట్‌ స్టార్టప్‌ ప్రయోగం కాగా.. ఇస్రోకు ఈ ఏడాది ఇదే తొలి ప్రయోగం. ఈ ఏడాది కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలతో పాటు, గగన్‌యాన్‌కు సంబంధించిన రెండు మానవరహిత ప్రయోగాలు కలుపుకొని మొత్తం ఆరు ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. నారాయణన్‌ తెలిపారు.

నిరంతరం నిఘా.. కీలకం కానునున్న GSLV F-17 ..

భారత ఉపఖండంపై నిరంతరం నిఘా ఉంచే అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహంగా ఈ మిషన్‌ కీలకం కానుంది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి.. ప్రత్యేక పరిస్థితుల్లో కేవలం 5 నిమిషాలకే ఒకసారి కొత్త చిత్రాలను ఈ ఉపగ్రహం అందిస్తుంది. తుఫానులు, వరదలు, కార్చిచ్చులు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించడంతో పాటు వాతావరణ మార్పులను నిరంతర పర్యవేక్షించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. అలాగే దేశ సరిహద్దులపై రియల్‌ టైమ్‌ వ్యూహాత్మక నిఘా ఉంచేందుకు, వాతావరణ మార్పులను నిత్యం కచ్చితత్వంతో పర్యవేక్షించేందుకు ఈ మిషన్‌ కీలకపాత్ర పోషిస్తుందని ఇస్రో తెలిపింది.

అంతకుముందు.. GSLV F-17 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు నుంచి ఆనంద నిలయంలోకి వెళ్లిన నారాయణన్, GSLV F-17, EOS- 05 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Follow Us