ఓరి దేవుడా.. అజ్ఞానంతో దారుణం..! నెల రోజుల పసికందు ఒంటిపై 40 వాతలు
ఆ ఊరిలో ఎక్కడా బడి లేదు. చదువుకున్న వారు ఒక్కరూ లేరు. దీంతో ఊరంతా అజ్ఞానాంధకారాన్ని తొలగించే దిక్కులేక మూఢనమ్మకాల్లో మగ్గిపోతుంది. ఆ ఊరే కాదు. దాని చుట్టుపక్కలున్న దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. తాజాగా నిండా నెల రోజులు కూడా నిండని పసికందుకు జ్వరం వస్తే ఏదో దుష్టశక్తి ఆవహించిందని లేత తమలపాకు వంటి శిశువు ఒంటిపై వేడివేడి చువ్వలతో వాతలు పెట్టారు కన్నోళ్లు..

భువనేశ్వర్, మార్చి 3: నిండా నెల రోజులు కూడా నిండని పసికందును కన్నోళ్లు చిత్రహింసలకు గురి చేశారు. లేత తమలపాకు వంటి శిశువు ఒంటిపై వేడివేడి చువ్వలతో వాతలు పెట్టారు. కళ్లు కూడా సరిగ్గా తెరవని పసికూన ఒంటిపై ఏకంగా 40 వాతలు పెట్టారు. చిన్న ప్రాణం ఎంత అల్లాడిపోయి ఉంటుందో కదా.. శిశువు ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రికి తరలించడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మూఢనమ్మకాల ముసుగులో ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ కుటుంబం కన్నబిడ్డను చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లా ఫుండెల్పాడ గ్రామానికి చెందిన ఓ మహిళ నెల క్రితం బాబుకు జన్మనిచ్చింది. అయితే గత పది రోజులుగా శిశువుకు తీవ్ర జ్వరం వచ్చింది. అధిక జ్వరం వల్ల పసి బాలుడు ఏడ్వ సాగాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడికి దుష్టశక్తి అవహించి ఉంటుందని భావించారు. అజ్ఞానంథకారంలో మూఢనమ్మకాల ముసుగులో పసివాడి పొట్ట, తలపై ఎర్రగా కాల్చిన కాడతో 30 నుంచి 40 సార్లు వాతలు పెట్టారు. ఈ దారుణ చర్యలతో పసివాడు అల్లాడిపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పరుగెత్తారు. శిశువు ఒంటిపై ఎర్రని వాతలు చూసిన డాక్టర్లు తీవ్ర షాక్‌కు గురయ్యారు. వెంటనే చికిత్స ప్రారంభించి చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (సీడీఎంవో) డాక్టర్ సంతోష్ కుమార్ పాండాకు సమాచారం అందించారు. ఆయన ఆస్పత్రికి చేరుకుని శిశువు ఆరోగ్యంపై ఆరా తీశారు. కాల్చిన చువ్వతో వాతలు పెడితే జ్వరం తగ్గుతుందని, దుష్టశక్తి ప్రభావం వల్ల తమ బిడ్డడు అనారోగ్యం భారిన పడ్డాడని భావించి ఇలా చేశామని కన్నోళ్లు చెప్పినట్లు ఆయన తెలిపారు.
మారుమూల ప్రాంతాలలో ఇటువంటి ఆచారాలు చాలా కాలంగా జరుగుతున్నాయని, అనారోగ్యంతో ఉన్న వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకురావడానికి బదులుగా ఇలా చేస్తున్నారని సీడీఎంవో డాక్టర్ సంతోష్ తెలిపారు. ఆరోగ్య శాఖ చందహండి మారుమూల ప్రాంతాలపై దృష్టి సారించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




