వనం వీడి జనంలోకి పులులు.. ఐదేళ్లలో ఎంత మంది బలయ్యారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
భారతదేశంలో అభివృద్ధి పనుల వల్ల అడవులు తగ్గిపోవడం, సహజ ఆవాసాలు దెబ్బతినడంతో మానవ-పులి సంఘర్షణ తీవ్రమైంది. గత ఐదేళ్లలో 393 మంది పులుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పులులు ఆహారం, నీటి కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి. అడవుల నరికివేత, వన్యప్రాణి కారిడార్ల విధ్వంసం ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఈ భయంకరమైన పరిస్థితిని ఆపడానికి అటవీ సంరక్షణే ఏకైక పరిష్కారం.

భారతదేశంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్న కొద్దీ అడవులపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. రోడ్లు, రైల్వేలు, మైనింగ్, విద్యుత్, నీటిపారుదల, జలవిద్యుత్ వంటి ప్రాజెక్టుల కోసం భారీగా అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. మరోవైపు అడవులు తగ్గిపోవడం, వన్యప్రాణుల సంచార మార్గాలు దెబ్బతినడం, అడవుల చుట్టూ మానవ నివాసాలు పెరగడంతో మానవ-పులి సంఘర్షణ తీవ్రతరం అవుతోంది. ఫలితంగా పులుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.
ఐదేళ్లలో 393 మంది మృతి
2021 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా పులుల దాడుల్లో 393 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే 2022లో అత్యధికంగా 109 మంది మృతి చెందారు. 2021లో 51 మంది, 2023లో 88 మంది, 2024లో 74 మంది, 2025లో 71 మంది పులుల దాడుల్లో మరణించారు. అంతకుముందు 2020లో కూడా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర అత్యంత ప్రభావిత రాష్ట్రంగా నిలిచింది. 2021-25 మధ్య అక్కడ పులుల దాడుల్లో ఏకంగా 231 మంది మరణించారు.
ఏ రాష్ట్రంలో ఎన్ని మరణాలుః
అస్సాం: 4 మరణాలు
బీహార్: 17 మరణాలు
ఛత్తీస్‌గఢ్: 4 మరణాలు
జార్ఖండ్: 0 మరణాలు
కర్ణాటక: 11 మరణాలు
కేరళ: 7 మరణాలు
మధ్యప్రదేశ్: 39 మరణాలు
మహారాష్ట్ర: 231 మరణాలు
మిజోరం: 0 మరణాలు
ఒడిశా: 0 మరణాలు
రాజస్థాన్: 6 మరణాలు
తమిళనాడు: 2 మరణాలు
తెలంగాణ: 3 మరణాలు
ఉత్తర ప్రదేశ్: 52 మరణాలు
ఉత్తరాఖండ్: 10 మరణాలు
పశ్చిమ బెంగాల్: 7 మరణాలు
పులులు గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయి?
పులులు సాధారణంగా మనుషుల నివాస ప్రాంతాల్లోకి రావడానికి కారణం ఒక్కటే కాదు. అడవుల విస్తీర్ణం తగ్గడం, వాటి సహజ ఆవాసాలు విడిపోవడం, ఆహారం-నీటి వనరుల్లో మార్పులు, పులుల సంచార పరిధిలో మానవ కార్యకలాపాలు పెరగడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. రోడ్లు, రైల్వేలు, గనులు, విద్యుత్ లైన్లు, పరిశ్రమలు, వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలు అడవుల మధ్య ఏర్పడుతున్నప్పుడు పెద్ద అటవీ ప్రాంతాలు చిన్నచిన్న భాగాలుగా విడిపోతున్నాయి. దీనినే హాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. దీని ప్రభావం పులుల సహజ సంచార మార్గాలపై పడుతుంది.
పులులు ఆహారం, నీరు, తమ భూభాగం, సంతానోత్పత్తి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. వాటి సహజ మార్గాల్లో మానవ కార్యకలాపాలు అడ్డుగా మారినప్పుడు పులులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో గ్రామాలు, వ్యవసాయ పొలాలు, మానవ నివాస ప్రాంతాల వైపు వాటి రాక పెరిగే ప్రమాదం ఉంటుంది.
వాల్మీకి నుంచి పిలిభిత్ వరకు భయాందోళనలు
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న వాల్మీకి టైగర్ రిజర్వ్ పరిసరాల్లో ఇటీవల కేవలం 17 రోజుల వ్యవధిలో పులుల దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో స్థానిక గ్రామాల్లో భయాందోళనలు పెరిగాయి. త్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ పరిసర ప్రాంతాల్లోనూ చెరకు పొలాలు, అడవులకు సమీపంలో పులుల సంచారం కారణంగా తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అడవులకు ఆనుకుని వ్యవసాయం, మానవ నివాసాలు విస్తరించడంతో ప్రమాదం మరింత పెరుగుతోంది.
అడవులు ఎంత తగ్గుతున్నాయంటే..?
అటవీ భూమి మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 71,023.30 హెక్టార్ల అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాల కోసం మళ్లించేందుకు అనుమతులు లభించాయి. అంటే కేవలం మూడేళ్లలో సుమారు 710 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి ఇతర అవసరాలకు వినియోగించేందుకు ఆమోదించారు. రాష్ట్రాల వారీగా చూస్తే మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 19,432.14 హెక్టార్లు మళ్లించారు. ఒడిశాలో 8,965.71 హెక్టార్లు, అరుణాచల్‌ప్రదేశ్‌లో 7,334.87 హెక్టార్లు, జార్ఖండ్‌లో 5,409.56 హెక్టార్లు, ఛత్తీస్‌గఢ్‌లో 4,218.95 హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 3,390.87 హెక్టార్ల అటవీ భూమికి అనుమతులు లభించాయి.
ఏ ప్రాజెక్టులకు ఎక్కువగా అడవులు మళ్లింపు?
అటవీ భూమి మళ్లింపులో మైనింగ్ ప్రాజెక్టులు ముందంజలో ఉన్నాయి. మైనింగ్ కోసం 16,463.28 హెక్టార్ల అటవీ భూమికి అనుమతి లభించింది. జలవిద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులకు 14,294.41 హెక్టార్లు, రహదారుల నిర్మాణానికి 12,714.93 హెక్టార్లు, విద్యుత్ ప్రసార లైన్ల కోసం 7,711.55 హెక్టార్లు మళ్లించారు. రక్షణ ప్రాజెక్టులకు 6,276.01 హెక్టార్లు, రైల్వే ప్రాజెక్టులకు 3,887.71 హెక్టార్ల అటవీ భూమి ఆమోదించడం జరిగింది.
చెట్లు నాటితే సమస్య పరిష్కారమవుతుందా?
ప్రాజెక్టుల కోసం అటవీ భూమిని మళ్లించినప్పుడు ప్రభుత్వం పరిహార అటవీకరణను చేపడుతోంది. గత ఐదేళ్లలో 1,78,261.52 హెక్టార్ల విస్తీర్ణంలో పరిహార అటవీకరణ చేపట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో నాటిన మొక్కల మనుగడ రేటు 40 నుంచి 100 శాతం వరకు నమోదైంది. యితే సహజ అడవిని కేవలం కొత్తగా చెట్లు నాటడం ద్వారా వెంటనే భర్తీ చేయడం సాధ్యం కాదు. సహజ అడవి అంటే చెట్ల సమూహం మాత్రమే కాదు. అక్కడ నీటి వనరులు, గడ్డి, పొదలు, కీటకాలు, చిన్న జంతువులు, పులులకు ఆహారంగా ఉండే వన్యప్రాణులు, అనేక జీవుల మధ్య సంక్లిష్టమైన జీవావరణ వ్యవస్థ ఉంటుంది. కొత్తగా పెంచిన అడవి ఆ స్థాయి జీవావరణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందంటున్నారు నిపుణులు.
అడవుల రక్షణే అసలు పరిష్కారం
పులుల దాడులను పూర్తిగా అరికట్టాలంటే పులుల సంఖ్యను మాత్రమే నియంత్రించడం పరిష్కారం కాదని నిపుణుల అభిప్రాయం. పులుల సహజ ఆవాసాలు, వన్యప్రాణి కారిడార్లు, నీటి వనరులు, వేట జంతువుల ఆవాసాలను రక్షించడం అత్యంత కీలకం. లుల జనాభా పెరగడం, రక్షిత ప్రాంతాల వెలుపల వాటి సంచారం, అడవుల చుట్టూ వ్యవసాయం-జనాభా విస్తరణ, సహజ ఆహారం లభ్యతలో మార్పులు, మానవ కార్యకలాపాల పెరుగుదల వంటి అంశాలు మానవ-పులి సంఘర్షణకు కారణమవుతున్నాయి. దుకే పులులను కాపాడాలన్నా.. పులుల దాడుల్లో మనుషుల ప్రాణాలను రక్షించాలన్నా అడవులను, వన్యప్రాణి సంచార మార్గాలను కాపాడటం తప్పనిసరి. అభివృద్ధి అవసరమే అయినప్పటికీ, అడవులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించకపోతే రాబోయే రోజుల్లో మానవుడు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
