Indian Railways: రైళ్లలో ఆహార పదార్థాలపై అధిక ఛార్జీల వసూళ్ల నియంత్రణకు ఐఆర్‌సీటీసీ ప్లాన్..
Indian Railways: రైళ్లలోని ఆహార పదార్థాలపై విక్రయదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని రైలు ప్రయాణికులు వాపోతున్నారు.
Indian Railways: రైళ్లలోని ఆహార పదార్థాలపై విక్రయదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని రైలు ప్రయాణికులు వాపోతున్నారు. ఎంఆర్‌పి ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఈ విక్రయదారులపై నియంత్రణకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా అధిక ఛార్జీల వసూళ్లకు చెక్ పెట్టనుంది.
క్యాటరింగ్ సౌకర్యం ఉన్న అన్ని రైళ్లలో IRCTC ద్వారా ధరల నియంత్రణ చేయనున్నారు. రాజధాని, శతాబ్ది, తేజస్ వంటి రైళ్లలో రిజర్వేషన్‌తో కూడిన ఆహారం ఆప్షన్ ఉంది. అయితే, చాలా రైళ్లలో టిక్కెట్లతో పాటు ఫుడ్ బుక్ చేసుకునే సదుపాయం లేదు. ఇంకొన్ని రైళ్లలో క్యాటరింగ్ సేవలతో కూడిన ప్యాంట్రీ కార్లు ఉంటాయి.
ప్యాంట్రీ కారు లేని మూడవ రకం రైళ్లు కూడా ఉన్నాయి. ఇలాంటి రైళ్లలో IRCTC విక్రేతలు బేస్ కిచెన్ నుండి ఆహారాన్ని విక్రయిస్తారు. ఈ విక్రయదారులు కొన్నిసార్లు ప్రయాణీకుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు కంప్లైంట్స్ వస్తున్నాయి. వీరి వద్ద కార్డు స్వైపింగ్ మిషన్ ఉన్నప్పటికీ.. చాలా మంది ప్రయాణికులు కార్డుతో చెల్లింపులు చేయడానికి ఇష్టపడరు. అదే వారికి వరంగా మారింది.
ప్రయాణీకులు ఎక్కువగా నగదు చెల్లించడాన్ని ఆసరంగా తీసుకుంటున్న విక్రేతలు.. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే, ఈ సమస్య నుండి ప్రయాణీకులకు ఉపశమనం కలిగించడానికి, విక్రేతలను నియంత్రించడానికి IRCTC సరికొత్త ప్లాన్ చేసింది. మెనూ కార్డ్‌లోనే QR కోడ్‌ను ముద్రించింది. అలాగే, విక్రేతలు QR కోడ్ కార్డ్‌ను కూడా ధరిస్తారు.
ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన తర్వాత ప్రయాణికులు మెనూ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు చేయగలుగుతారు. IRCTC అన్ని రైళ్లలో ఈ ఏర్పాటు చేస్తుంది. సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో కొత్త సిస్టమ్ ఇప్పుడే ప్రవేశపెట్టింది. దీని తర్వాత క్రమంగా అన్ని రైళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో ప్రయాణికులకు అధిక ఛార్జీల నుంచి ఉపశమనం లభించనుంది.