AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపల ప్రియులకు గుడ్ న్యూస్..! ‘క్వీన్ ఆఫ్ ఫిషెస్’ కోసం బంగ్లాదేశ్‌కు భారత్ రిక్వెస్ట్..!

దుర్గా పూజకు ముందు బంగ్లాదేశ్‌ నుంచి హిల్సా చేపల ఎగుమతులను పునఃప్రారంభించాలని భారత చేపల దిగుమతిదారులు విజ్ఞప్తి చేశారు. ‘క్వీన్ ఆఫ్ ఫిషెస్‌’గా పేరొందిన హిల్సాకు పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన చేపల దిగుమతిదారుల సంఘం బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రికి లేఖ రాసింది. బంగ్లాదేశ్‌తో తమకు దశాబ్దాలుగా వాణిజ్య సంబంధాలు ఉన్నాయని సంఘం తెలిపింది.

చేపల ప్రియులకు గుడ్ న్యూస్..! ‘క్వీన్ ఆఫ్ ఫిషెస్’ కోసం బంగ్లాదేశ్‌కు భారత్ రిక్వెస్ట్..!
Hilsa Fish
Balaraju Goud
|

Updated on: Sep 12, 2026 | 7:42 PM

Share

దుర్గా పూజకు ముందు బంగ్లాదేశ్‌ నుంచి హిల్సా చేపల ఎగుమతులను పునఃప్రారంభించాలని భారత చేపల దిగుమతిదారులు విజ్ఞప్తి చేశారు. ‘క్వీన్ ఆఫ్ ఫిషెస్‌’గా పేరొందిన హిల్సాకు పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన చేపల దిగుమతిదారుల సంఘం బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రికి లేఖ రాసింది. బంగ్లాదేశ్‌తో తమకు దశాబ్దాలుగా వాణిజ్య సంబంధాలు ఉన్నాయని సంఘం తెలిపింది. 1996 నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బెనపోల్, త్రిపురలోని అఖౌరా భూ సరిహద్దు కస్టమ్స్ స్టేషన్ల ద్వారా హిల్సా చేపలను దిగుమతి చేసుకున్నట్లు పేర్కొంది.

అయితే 2012 జూలైలో బంగ్లాదేశ్ ప్రభుత్వం హిల్సా చేపల ఎగుమతులపై నిషేధం విధించింది. అప్పటి నుంచి ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని దిగుమతిదారులు తెలిపారు. 2019 నుంచి దుర్గా పూజ సమయంలో పరిమిత కాలానికి ప్రత్యేక అనుమతులు ఇవ్వడం ప్రారంభించినప్పటికీ, కేవలం ఒక నెల వ్యవధి మాత్రమే ఉండటంతో వాణిజ్యపరంగా పెద్దగా ప్రయోజనం కలగలేదని పేర్కొన్నారు.

భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్ల పరంగా పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని సంఘం తన లేఖలో ప్రస్తావించింది. ముఖ్యంగా ‘పొద్దార్ ఇలిష్’గా ప్రసిద్ధి చెందిన హిల్సా చేపకు బెంగాలీ ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉందని తెలిపింది. దుర్గా పూజ సందర్భంగా హిల్సాకు డిమాండ్ మరింత పెరుగుతుందని, అందువల్ల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసి నిరంతర వాణిజ్యానికి అనుమతించాలని దిగుమతిదారులు కోరారు.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ గత ఏడాది దుర్గా పూజకు ముందు 1,200 టన్నుల హిల్సా ఎగుమతికి అనుమతించింది. 2026 సెప్టెంబర్‌లో మాత్రం 2,420 టన్నుల హిల్సా ఎగుమతికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. తాజా విజ్ఞప్తిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది దుర్గా పూజకు ముందు బెంగాల్ చేపల మార్కెట్లలో హిల్సా లభ్యతపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us