Agni Prime Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. అగ్ని-పి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
Agni Prime Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. అగ్ని-పి(ప్రైమ్) బాలిస్టిక్ క్షిపణి పరీక్ష శనివారం (డిసెంబర్ 18న) విజయవంతం అయింది. ఒడిశాలోని
Agni Prime Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. అగ్ని-పి(ప్రైమ్) బాలిస్టిక్ క్షిపణి పరీక్ష శనివారం (డిసెంబర్ 18న) విజయవంతం అయింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ తీరంనుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. తూర్పుతీరంలో ఏర్పాటు చేసిన పలు టెలీమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ స్టేషన్లు, నౌకల్లో అమర్చిన పరికరాలు క్షిపణి మార్గాన్ని ట్రాక్ చేస్తూ దాని పనితీరును పర్యవేక్షించాయి. నిర్దేశించిన ప్రమాణాలను అత్యంత కచ్చితత్వంతో క్షిపణి చేరుకుందని డీఆర్డీవో ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 28న అగ్ని-పి క్షిపణిని తొలిసారిగా డీఆర్డీవో (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) విజయవంతంగా పరీక్షించింది.
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రత్యేకతలివే.. 1. అణు వార్ హెడ్లను మోసుకుపోయే సామర్థ్యం కలిగిన నవతరం క్షిపణి ఇది. 1000 నుంచి 2000 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే శక్తి దీని సొంతం. 2. రెండు దశలు కలిగిన అగ్ని- పి క్షిపణి.. కచ్చితత్వంతో కూడిన నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థతో పాటు ఘన ప్రపోల్లెంట్‌తో కూడిన ప్రయోగ వేదికల నుంచి దీనిని ప్రయోగించవచ్చు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కూడిన ఈ రెండో ప్రయోగంలో అగ్ని-పి అద్భుతంగా శాస్త్రవేత్తల అంచనాల మేరకు సామర్థ్యాన్ని చాటింది. 3. అగ్ని సిరీస్ బాలిస్టిక్ క్షిపణుల్లో తాజా క్షిపణి అత్యంత తేలికైనది, పరిమాణంలో అతి చిన్నది. అగ్ని-పి బరువు అగ్ని3 క్షిపణి బరువులో కేవలం 50 శాతమే ఉంటుంది. 4. అగ్ని-పి రెండు దశల క్షిపణి వ్యవస్థను కొత్త ప్రొపల్షన్ వ్యవస్థలను అమరుస్తూ అభివృద్ధి చేశారు. ఇది రాకెట్ మోటార్ తో పాటు అడ్వాన్స్ డ్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలతో ముందుకు సాగుతుంది. 5. ఈ క్షిపణిని రైలు, రోడ్డు పై నుంచి కూడా వాహనాల నుంచి ప్రయోగించే సౌలభ్యం కలిగివుంది. ఇవి కానిస్టెరైజ్ డ్ క్షిపణి అంటే.. కంటైనర్ బేస్డ్ లాంచింగ్ వ్యవస్థ కలిగివుంది. దీంతో అగ్ని-పి క్షిపణులను లాంచ్ చేయడానికి సమయం తక్కువ పడుతుంది. ఈ క్షిపణులను స్టోర్ చేయడానికి రవాణాచేయడం తేలిక.
భారత్ వద్ద ఉన్న అగ్ని క్షిపణులు.. భారత్ వద్ద ఉన్న అణు సామర్థ్యమున్న క్షిపణుల్లో అగ్ని క్షిపణులు ప్రధానమైనవి అగ్ని క్షిపణులు రేంజ్ అగ్ని 1- రేంజ్ 700-800 కి.మీ అగ్ని-2 – 2000 కి.మీ పైగా అగ్ని-3- 2500 కి.మీ పైగా అగ్ని-4- 3500 కి.మీ పైగా దీన్ని రోడ్ మైబైల్ లాంచర్ నుంచి ప్రయోగించే వీలు అగ్ని-5- 5000కి.మీ పైగా.. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి
చైనాను భయపెట్టే అగ్ని-5.. అగ్ని- 5క్షిపణితో చైనా భయపడుతోంది. ఒక్క ప్రాంతాన్నే కాకుండా విభిన్న ప్రాంతాలను టార్గెట్ చేసే సామర్థ్యం అగ్ని సొంతం. అగ్ని-5 క్షిపణి సామర్ధ్యం 5వే కిలోమీటర్లు అని చెబుతున్నప్పటికీ.. ఇది 8వేల కిలోమటర్ల వరకూ ఉంటుందని చైనా వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్షిపణి ద్వారా చైనాలోని ఏ నగరాన్నైనా భారత్ లక్ష్యంగా చేసుకోగలదని ఆ దేశం భయపడుతోంది. అణుబాంబు మోస్తూ ప్రపంచం మొత్తం చుట్టగలిగిన రాకెట్‌ను చైనా రహస్యంగా ప్రయోగించింది. ఆగష్టులో చైనా ప్రయోగం చేసినమాట వాస్తవమే అని అమెరికన్ ఇంటలిజెన్స్ కూడా తేలచ్చింది.
అగ్ని 6 పై భారత్ సన్నాహాలు.. 12,000 కిలోమీటర్ల దూరం లోని లక్ష్యాలను చేరుకోగల అగ్ని-6 తయారీకి కూడా సిద్దమవుతోన్న భారత్. ఇస్రో సహాయంతో డీఆర్‌డీవో దీనిని సూర్య అనే పేరుతో అభివృధ్ది చేస్తోందని వార్తలు వస్తున్నాయి. డాండ్ ఫెంగ్ పేరుతో ఇప్పటికే 12,000 కిలోమిటర్ల లక్ష్యాన్ని చేరుకోగల క్షిపణులను చైనా ఇప్పటికే తయారు చేసింది. అమెరికా, రష్యా వద్ద కూడా 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు ప్రయాణించగల క్షిపణులు ఉన్నాయి. 13,000 కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణిని తయారుచేసినట్లు ఉత్తర కొరియా కూడా ప్రకటించింది. అయితే ఈ క్షిపణుల వివరాలను అన్ని దేశాలూ రహస్యంగానే ఉంచుతున్నాయి.
Also Read:
CM KCR: ఆ రూల్‌తోనే ఉద్యోగుల విభజన.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, షణ్నులది లవ్ సిరీస్‌ను తలపిస్తోందా..?