AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై స్పందించిన విదేశాలు.. గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్

ఢిల్లీ మద్యం స్కామ్‌ కేసులో అరెస్ట్‌తో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వ్యవహారం గ్లోబల్‌ టాక్‌లా మారింది. ఈ కేసుపై మొన్న జర్మనీ, నిన్న అమెరికా స్పందించడం కలకలం రేపుతోంది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ భారత్‌ కన్నెర్ర చేసింది.

CM Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై స్పందించిన విదేశాలు.. గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్
Aravind Kejriwal
Balaraju Goud
|

Updated on: Mar 28, 2024 | 8:09 AM

Share

ఢిల్లీ మద్యం స్కామ్‌ కేసులో అరెస్ట్‌తో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వ్యవహారం గ్లోబల్‌ టాక్‌లా మారింది. ఈ కేసుపై మొన్న జర్మనీ, నిన్న అమెరికా స్పందించడం కలకలం రేపుతోంది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ భారత్‌ కన్నెర్ర చేసింది.

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుపై అంతర్జాతీయ స్పందనలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నామధ్య జర్మనీ దీనిపై ప్రకటన విడుదల చేయగా, తాజాగా అమెరికా కూడా స్పందించింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దీనిపై సీరియస్‌ అయిన భారత్‌ ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనా సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. అరగంట పాటు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దౌత్య సంబంధాల్లో దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని భావిస్తున్నామంటూ భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయని, ఇందులో కచ్చితమైన, సమయానుకూల ఫలితాలు వస్తాయని, అంచనాలు తగదని తేల్చి చెప్పింది.

అంతకుముందు జర్మనీ విదేశాంగశాఖ కూడా ఇదే తరహాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హుడని, అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చని ఆ ప్రకటనలో ఉంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌.. జర్మనీ రాయబారికి సమన్లు ఇచ్చింది. జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్‌ జార్జ్‌ ఎంజ్‌వీలర్‌ భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జర్మనీ తీరు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని భారత్ తేల్చి చెప్పింది.

మద్యం పాలసీకి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. తొలుత మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. తన అరెస్ట్‌, రిమాండ్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్ట్‌ స్పందించింది. కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయలేమని తెలిపింది. ఏప్రిల్‌ 2 లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 3కు విచారణను వాయిదా వేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…