Ram Nath Kovind: స్వస్థలానికి రైలులో ప్రయాణించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.. 15 ఏళ్ల తర్వాత..
Ram Nath Kovind: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రైలు ప్రయాణం చేశారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వస్థలమైన కాన్పూర్‌కు శుక్రవారం రైలులో బయలుదేరారు..

Ram Nath Kovind: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రైలు ప్రయాణం చేశారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వస్థలమైన కాన్పూర్‌కు శుక్రవారం రైలులో బయలుదేరారు. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక ట్రైన్ ఎక్కారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్‌గోయల్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సునీత్ శర్మ స్వయంగా వచ్చి వారికి వీడ్కోలు పలికారు. అయితే రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాంనాథ్ కోవింద్ తన స్వస్థలానికి వెళ్లడం ఇదే తొలిసారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే రాష్ట్రపతి ప్రయాణిస్తున్న రైలు.. కాన్పూర్ సమీపంలోని జింఝాక్, రూరా ప్రాంతాల్లో రెండు సార్లు ఆగనుంది. అక్కడ కోవింద్ తన పాఠశాల రోజుల్లో పరిచయమున్న వ్యక్తులతో కాసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత ఆయన తన సొంతూరికి చేరుకుంటారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించి.. తిరిగి జూన్ 28న కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో రైలెక్కి లఖ్‌నవూ వెళ్తారని రాష్ట్రపతి భవన్ తెలిపింది. లఖ్‌నవూలో రెండు రోజుల పర్యటన అనంతరం జూన్ 29 సాయంత్రం ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకుంటారని పేర్కొంది.
15 ఏళ్ల తర్వాత..
అయితే ఇలా రాష్ట్రపతి రైలులో ప్రయాణించడం 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. అంతకుముందు 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరు అయ్యేందుకు ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలులో ప్రయాణించారు. ఇక భారత తొలి ప్రథమ పౌరుడు రాజేంద్ర ప్రసాద్ కూడా రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఎక్కువ సార్లు రైలు ప్రయాణాలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు రాంనాథ్‌కోవింద్ కూడా రైలు ప్రయాణం చేయడం విశేషం.




