India Economy: భారత ఆర్థిక పురోగతి అన్‌స్టాపబుల్.. RBI డిప్యూటీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ఉందిలో మంచికాలం ముందుముందునా.. అన్నట్లు భారత ఆర్థిక వ్యవస్థ పైపైకి దూసుకుపోతోంది. దేశ ఆర్థిక వృద్ధిరేటు (జీడీపీ)కు సంబంధించి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పాత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ త్వరలోనే మునుపటి 8 శాతం జీడీపీ వృద్ధిరేటుకు చేరుకుంటుందని అంచనావేస్తున్నట్లు తెలిపారు.
అమెరికా వంటి అగ్రదేశాలతో పాటు చైనాలోనూ ఆర్థిక మాంధ్యం పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే భారత్ ఆర్థిక ప్రగతిలో పైపైకి దూసుకుపోతోంది. ఇతర దేశాల్లో మాంధ్యం పరిస్థితుల ప్రతికూలతను భారత్ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత ఆర్ధిక పురోగతి ముందుముందు మరింత మెరుగ్గా ఉంటుందని ఆర్థిక నిపుణులు, పారిశ్రామిక వర్గాలు అంచనావేస్తున్నాయి. భారత్ వృద్ధిరేటు త్వరలోనే మునుపటి 8 శాతానికి చేరే అవకాశముందన్న అంచనాలున్నాయి. భారత మార్కెట్‌లో నెలకొన్న ఈ అంచనాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ దేబబ్రత పాత్రా సమర్థించారు.
న్యూయార్క్ ఫెడ్ సెంట్రల్ బ్యాంకింగ్ సెమినార్‌లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత జీడీపీ వృద్ధిరేటు 7.2 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనావేస్తున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) భారత్ 7 శాతం జీడీపీ వృద్ధిరేటును సాధించే అవకాశమున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత జీడీపీ వృద్ధిరేటు పుంజుకుని.. మునుపటి 8 శాతానికి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు విశ్లేషించారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెమినార్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ఆర్బీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. కోవిడ్ పాండమిక్ ప్రభావం కారణంగానే ప్రస్తుతం భారత జీడీపీ 8 శాతానికి దిగువున ఉంటున్నట్లు దేవబ్రత పాత్రా విశ్లేషించారు. సమర్థవంతమైన ఆర్థిక విధానాలు దేశ జీడీపీ మళ్లీ 8 శాతానికి చేరుకునేందుకు దోహదపడుతాయని అన్నారు.
భారీగా పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు..
దేశ విదేశీ మారక నిల్వలు సెప్టెంబర్ 27న రికార్డు గరిష్ఠ స్థాయిలో 704.9 బిల్లియన్ డాలర్లకు చేరింది. ఆ తర్వాత అక్టోబర్ 11నాటికి మారక నిల్వలు క్షీణించి 690.4 బిల్లియన్ డాలర్లకు చేరింది. అయితే భారత విదేశీ మారక నిల్వల విలువ ఇతర బలమైన ఆర్థిక దేశాలతో పోలిస్తే భారీగా పెరిగాయి. 2024లో భారత్ విదేశీ మారక నిల్వలు ఏకంగా 68 బిల్లియన్ డాలర్లు పెరిగాయి. అత్యధికంగా విదేశీ మారక విలువలను పెంచుకున్న దేశాల జాబితాలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి