Kartarpur: కర్తార్‌పూర్ యాత్రకు వెళ్లేందుకు మరో ఐదేళ్లు నో వర్రీ.. ఇదిగో డీటేల్స్
కర్తార్‌పూర్‌లో ఉన్న సిక్కుల పవిత్ర క్షేత్రం సందర్శనకు భారత యాత్రికులను అనుమతి ఇస్తామని పాకిస్థాన్ వెల్లడించింది. ఈ మేరకు ఒప్పందాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు భారత్, పాక్.. ఉమ్మడి ప్రకటన చేశాయి..
కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌పై ఒప్పందం చెల్లుబాటును మరో ఐదేళ్లపాటు పొడిగించినట్లు భారత్, పాకిస్థాన్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశాయి. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ద్వారా భారతదేశం నుంచి గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పూర్, పాకిస్తాన్‌లోని నరోవాల్‌కు యాత్రికుల సందర్శనను సులభతరం చేయడానికి 24 అక్టోబర్ 2019న సంతకం చేసిన ఒప్పందం ఐదేళ్ల కాలానికి చెల్లుబాటులో ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
“ఈ ఒప్పందం చెల్లుబాటును పొడిగించడం వల్ల భారతదేశం నుండి వచ్చే యాత్రికులు పాకిస్తాన్‌లోని పవిత్ర గురుద్వారాను సందర్శించడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి యాత్రికుడికి ఒక్కో సందర్శనకు పాకిస్తాన్ విధించే USD 20 సర్వీస్ ఛార్జీని తొలగించడంపై యాత్రికుల నిరంతర అభ్యర్థనల దృష్ట్యా, యాత్రికుల నుండి ఎటువంటి రుసుము లేదా ఛార్జీలు విధించవద్దని భారతదేశం మరోసారి పాకిస్తాన్‌ను కోరింది, ”అని మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు, “భారతదేశం, పాకిస్తాన్ వచ్చే ఐదేళ్లపాటు శ్రీ కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌పై ఒప్పందాన్ని పునరుద్ధరించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మా సిక్కు సమాజం వారి పవిత్ర స్థలాలకు సందర్శనను సులభతరం చేయడం కొనసాగిస్తుంది.” అని ఆయన పేర్కొన్నారు.
India and Pakistan have renewed the agreement on Sri Kartarpur Sahib Corridor for the next five years.
PM @narendramodi’s government will continue to facilitate our Sikh community’s access to their holy sites.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 22, 2024
పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్ మందిరాన్ని సందర్శించేందుకు వీలుగా ఇరు దేశాల మధ్య ప్రత్యేక కారిడార్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసాిందే. పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్ ఆలయం నుంచి పంజాబ్‌లోని డేరాబాబా నానక్ మందిరాన్ని కలిపే ఈ కారిడార్ 2019 నవంబర్‌లో ఇటు భారత ప్రధాని నరేంద్రమోదీ, అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌లు ప్రారంభించారు. పాస్‌పోర్ట్ లేకుండానే భారత్ నుంచి సిక్కు యాత్రికులు ఆ ప్రదేశానికి వెళ్లే అవకాశం కూడా కల్పిస్తున్నారు.