Sputnik V Vaccine: మొదలైన “స్పుత్నిక్‌ వి” వ్యాక్సిన్ పంపిణీ… దేశంలో టీకా కొరత తీరనుందా?

|

May 17, 2021 | 2:54 PM

'స్పుత్నిక్‌ వి' వ్యాక్సిన్ పంపిణీ మొదలయ్యింది. దేశ ప్రజలకు మూడో వ్యాక్సిన్‌ 'స్పుత్నిక్‌ వి' నేటి నుంచే అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే నాలుగు నెలలుగా రెండు కంపెనీల టీకాలతో దేశంలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది.

Sputnik V Vaccine: మొదలైన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్ పంపిణీ... దేశంలో టీకా కొరత తీరనుందా?
Russian Sputnik V Vaccine
Follow us on

‘స్పుత్నిక్‌ వి’ వ్యాక్సిన్ పంపిణీ మొదలయ్యింది. దేశ ప్రజలకు మూడో వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వి’ నేటి నుంచే అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే నాలుగు నెలలుగా రెండు కంపెనీల టీకాలతో దేశంలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను 2021, జనవరి 16 నుంచే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది భారత ప్రభుత్వం. ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌లు ప్రజలకు అందుబాటులోకి ఉండటంతో…ఇప్పుడు స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్ మూడో టీకాగా నిలుస్తోంది.

దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్లు…
ఒకటి… ఆక్స్ ఫర్డ్ వర్సిటీతో కలిసి సీరమ్ ఇనిస్టిట్యూట్ మనదేశంలో తయారుచేస్తున్న ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్.
రెండు… హైదరాబాదీ కంపెనీ భారత్‌ బయోటెక్ తయారు చేసిన కరోనా టీకా ‘కొవాగ్జిన్‌’
మూడు… 17-05-2021) ప్రజలకు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వస్తున్న స్పుత్నిక్‌ వి

స్పుత్నిక్​.. వరల్డ్​లో​ ఫస్ట్ టీకా​
ప్రపంచంలో రిజస్టర్​ అయిన మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్​ స్పుత్నిక్​ Vనే కావడం విశేషం. వైరల్​ వెక్టర్​ టెక్నాలజీ ఆధారంగా రష్యా ప్రభుత్వ సంస్థ గమాలియా రీసెర్చ్​ ఇనిస్టి ట్యూట్​ ఈ వ్యాక్సిన్​ను తయారు చేసింది. కరోనా వైరస్​లోని ఎస్​ ప్రొటీన్​ను అడినోవైరస్​లతో కలపి ఆర్​ఏడీ26, ఆర్​ఏడీ5 అనే డోసులుగా వ్యాక్సిన్​ను చేశారు. 40 వేల మందిపై మూడో ఫేజ్​ ట్రయల్స్​ చేశారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఎఫికసీ రేట్ 91.6 శాతంగా ఉందని రష్యా చెబుతోంది. 2 నుంచి 8 డిగ్రీల వద్ద స్టోర్​ చేసుకోవచ్చు. మన దేశంలో ఆ వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేసేందుకు డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీతో రష్యా ఒప్పందం చేసుకుంది. వ్యాక్సిన్​ ఎమర్జెన్సీ వాడకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1957లో రష్యా పంపిన తొలి ఉపగ్రహం స్పుత్నిక్​ పేరునే వ్యాక్సిన్​కూ పెట్టారు.

మనదేశంలో ‘స్పుత్నిక్‌ వి’ టీకా పంపిణీకి ఆర్‌డీఐఎఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌తో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఈ టీకాపై డాక్టర్‌ రెడ్డీస్‌ అన్ని దశల క్లినికల్‌ పరీక్షలు నిర్వహించి టీకా పంపిణీకి అనుమతి పొందింది. దీనికి అనుగుణంగా ఆర్‌డీఐఎఫ్‌ రష్యా నుంచి కొన్ని డోసుల టీకాను నేరుగా మనదేశానికి తీసుకువచ్చి డాక్టర్‌ రెడ్డీస్‌కు అందించింది. ప్రస్తుతం టీకాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నా… జూన్‌ చివరినాటికి మనదేశంలోనే టీకాను ఉత్పత్తి ప్రారంభిస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ చెబుతోంది.

మే 1న 1.5 లక్షల టీకా డోసులు, నిన్న 60 వేల టీకా డోసులు రష్యా నుంచీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నాయి.
మొత్తం 2.10 లక్షల డోసులతో నేటి నుంచీ మనదేశంలో స్పుత్నిక్‌ వి వ్యాక్సినేషన్‌ మొదలవుతోంది. తాము రష్యా నుంచీ తెప్పించి ఇక్కడ పంపిణీ చేస్తున్న ఈ టీకా ధరను 995 రూపాయలుగా డాక్టర్‌ రెడ్డీస్‌ నిర్ణయించింది.

Sputnik V

స్పుత్నిక్ వి టీకా ఉత్పత్తికి 6 ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు…
ఆర్‌డీఐఎఫ్‌ మనదేశంలో స్పుత్నిక్‌ వి టీకా ఉత్పత్తికి 6 ఔషధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో హెటెరో బయో ఫార్మా ఒకటి. మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి హెటెరో బయోఫార్మాకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే…భారత ఔషధ నియంత్రణ మండలికి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) సిఫార్సు చేసింది. క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు అనుమతి లభించినందున వెంటనే ఈ ప్రక్రియ పూర్తిచేసి టీకా అందించడానికి హెటెరో బయోఫార్మా సన్నద్ధమవుతోంది. ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతర కంపెనీల్లో గ్లాండ్‌ ఫార్మా, విర్కో బయోటెక్‌, స్టెలిస్‌ బయో, పానేషియా బయోటెక్‌, శిల్ప మెడికేర్‌ ఉన్నాయి.

రెండు డోసుల ‘స్పుత్నిక్‌ వి’ టీకాను అభివృద్ధి చేసిన ఆర్‌డీఐఎఫ్‌ సంస్థ, తాజాగా ఒకే డోసు ‘స్పుత్నిక్‌ లైట్‌’ టీకాను రూపొందించింది.  ఒకే డోసు ‘స్పుత్నిక్‌ లైట్‌’ టీకా పంపిణీకి మే నెల 6న రష్యాలో అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. భారత్‌ కు కూడా త్వరలో సింగ్‌ డోసు టీకాలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్న రష్యా రాయబారి నికోలాయ్‌ కుడషెవ్‌.

భారతదేశంలో ఇప్పటి వరకూ టీకాల పంపిణీ…
2021, జనవరి 16న టీకా పంపిణీ మొదలైన తరువాత ఇప్పటి వరకూ ప్రజలకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య మొత్తం – 18,29,26,460.  ఇందులో కొవిషీల్డ్ వాటా – 16.3 కోట్లు కాగా, కొవాగ్జిన్‌ టీకా వాటా – 1.8 కోట్ల డోసులు.

ఇది కూడా చదవండి… ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తుల వ్యవస్థలో టాప్ ప్లేస్ లో ఇండియా.. మరి కరోనా టీకాకు ఏమైంది?.. నిపుణులు ఏమంటున్నారు?

కరోనా టీకా కోసం కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా? పాజిటివ్ వస్తే  వ్యాక్సిన్ తీసుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?