Jharkhand: ట్రైనింగ్‌కోసం వెళ్లిన ఐఐటీ విద్యార్థినిపై ఐఏఎస్ అధికారి లైంగిక వేధింపులు.. సీన్ కట్ చేస్తే..
ఐఐటీ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆ ఐఏఎస్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.
Khunti (Jharkhand): అతనో మంచి హోదా కలిగిన వ్యక్తి. నలుగురికి మార్గదర్శకుడిగా నిలవాల్సిన ఉన్నతమైన ఉద్యోగం ఐఏఎస్ కొలువులో ఉన్నాడు.. కానీ,అతని వక్రబుద్ధితో నీచంగా ప్రవర్తించాడు. దాంతో సదరు అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటల్లోకి నెట్టారు.. ఈ ఘటన జార్ఖండ్‌లో కలకలం రేపింది. ఐఐటీ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆ ఐఏఎస్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖుంటి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన తరువాత 2019 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారిని సోమవారం రాత్రి అరెస్టు చేసినట్టు ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న అధికారిని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సయ్యద్ రియాజ్ అహ్మద్‌గా గుర్తించారు.
ఐఐటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌లో ఒకరైన బాధితురాలు శిక్షణ నిమిత్తం జార్ఖండ్‌లోని ఖుంటికి వచ్చారు. ఐఐటీ విద్యార్ధుల కోసం శనివారం రాత్రి డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అతిధులందరికీ మద్యం సరఫరా చేశారు. ఈ పార్టీలో ఒంటరిగా ఉందని బాధితురాలిని గుర్తించిన ఐఏఎస్ అధికారి ఆమెను లైంగికంగా వేధించారు. సదరు ఐఏఎస్ అధికారిని, ఇతర అతిథులను విచారించిన తరువాత ఆ ఆరోపణలు నిజమని ప్రాథమికంగా తేలినట్టు ఎస్పీ చెప్పారు. ప్రాధమిక దర్యాప్తులో బాధితురాలి ఆరోపణలు వాస్తవమని తేలిందన్నారు. విద్యార్ధినిని వైద్య పరీక్షలకు తరలించామని ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి