AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖ్యమంత్రి మార్పుపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప.. వారి మద్దతు ఉన్నంతకాలం ఎవరు ఏం చేయలేరని వ్యాఖ్య

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అండ తనకు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని యడియూరప్ప స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి మార్పుపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప.. వారి మద్దతు ఉన్నంతకాలం ఎవరు ఏం చేయలేరని వ్యాఖ్య
Balaraju Goud
|

Updated on: Feb 06, 2021 | 3:07 PM

Share

Karnataka CM Yediyurappa comments : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పదవికి వచ్చిన డోకా ఏమిలేదని తేల్చి చెప్పారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరూ దింపలేరని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అండ తనకు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని యడియూరప్ప స్పష్టం చేశారు. గత కొంతకాలంగా ఆ రాష్ట్ర మార్పుపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప సవాళ్లతో సహవాసం చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అసంతృప్తులు బయటకు వస్తున్నారు. 2019 జూలైలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీలోని సీనియర్‌ నాయకులు సీఎం మార్పుపై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో సీఎం మార్పిడిపై రోజుకో ప్రకటన వస్తోంది.

అయితే, ఇదే క్రమంలో కొందరు నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని రోజూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఈ విషయంపై యడియూరప్ప స్పందించారు.

ఉగాది తర్వాత ఏప్రిల్‌ 13వ తేదీన కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్‌ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మరికొందరు నాయకులు వంతపాటడంతో కర్ణాటక వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఇలాంటి ప్రకటనలు చేస్తుండడంతో యడియూరప్ప అసెంబ్లీ వేదికగా వారికి జవాబిచ్చారు. అమిత్‌ షా మద్దుతు తనకు ఉన్నంత వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగుతానన్నారు. మరోవైపు తనపై ఉన్న ఆభియోగాలను తాను న్యాయ పోరాటాలన్నింటినీ దీటుగా ఎదుర్కొని బయటకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంద కేసులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్‌ షాలకు తనపై విశ్వాసం ఉంచారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు.

ఇదీ చదవండి… ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలి.. ఎన్నికల సమయంలో ఎంతటి వారైనా కోడ్‌ పాటించాల్సిందే -తులసిరెడ్డి