Winter Forecast: ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారన్న ఐఎండీ!
ఎల్‌నీనో ఎఫెక్ట్ కేవలం.. వర్షాకాలంపైనే కాదు.. రాబోయే శీతాకాలంపై కూడా ఉండబోతుందని..భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో శీతాకాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. హైదరాబాద్‌లో ఈసారి చలి తీవ్రత తక్కువగా ఉండవచ్చని తెలిపింది.దీంతో హైదరాబాద్ వాసులు చలి లేని శీతాకాలంను అనుభవించనున్నారు.

హైదరాబాద్‌లో ఈ ఏడాది వర్షాకాలం అంతంతమాత్రంగానే ఉండగా.. రానున్న చలికాలంలోనూ చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. ఈ శీతాకాలంలో నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. దీంతో ఈసారి హైదరాబాద్ వాసులకు ‘చలి లేని శీతాకాలం’ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్‌లో హైదరాబాద్‌లో మొత్తం 458.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో నగరంలో 627.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి దాదాపు 169 మిల్లీమీటర్ల మేర లోటు ఏర్పడింది.
IMD తాజాగా విడుదల చేసిన ‘సీజనల్ ఔట్‌లుక్’ ప్రకారం.. అక్టోబర్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలు ఇందుకు మినహాయింపుగా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలకు ప్రధాన కారణాల్లో ఎల్‌నినో ప్రభావం ఒకటిగా వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే వేడెక్కే వాతావరణ పరిస్థితినే ఎల్‌నినో అంటారు.
ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తీవ్ర వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ రానున్న శీతాకాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది. సాధారణంగా అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
అయితే ప్రస్తుతం మాత్రం ఎండ తీవ్రత కొనసాగుతోంది. బుధవారం నగరంలో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా సైదాబాద్‌లో నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి తగ్గడం లేదు. ఈ ఎల్‌నినో పరిస్థితులు ఇలానే కొనసాగితే రానున్న శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది హైదరాబాద్‌లో చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
