How Mumbai tackled the rising curve : ముంబయిలో కరోనా తగ్గుముఖం, ఏమిటీ.. అసలు కారణం.. ?

Mumbai tackled the rising curve : దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి... దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరాన్ని చిగురుటాకులా వణికించింది..

How Mumbai tackled the rising curve : ముంబయిలో కరోనా తగ్గుముఖం, ఏమిటీ.. అసలు కారణం.. ?
Representative Pic

Mumbai tackled the rising curve : దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి… దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరాన్ని చిగురుటాకులా వణికించింది. ఈ ఒక్క నగరంలోనే రోజుకు వందల మందిని వైరస్‌ పొట్టన పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడిని సవాల్‌గా స్వీకరించిన అక్కడి ప్రభుత్వం, నగర పాలక అధికారులు… అతి తక్కువ సమయంలో కరోనా మహమ్మారిని నిలువరించగలిగారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటించి… సుప్రీంకోర్టు ప్రశంసలు సైతం పొందారు. విపత్తువేళ ముంబయి అనుసరించిన వ్యూహం ఏమిటి…? అనేది ఒక సారి పరికిస్తే, వైరస్‌పై పోరులో బృహన్‌ ముంబయి మహానగర పాలక సంస్థ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్ చాహల్‌ విశిష్ఠమైన కృషి చేశారనే చెప్పాలి. గతేడాది మే నెలలో నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో ముంబయిలో కరోనా ఉద్ధృతంగా ఉంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా… కేసులు విపరీతంగా నమోదయ్యాయి. చెత్త కుండీల్లో మృతదేహాలు, రోడ్లపైన అనాథశవాలతో భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. మరోవైపు నగరంలో ఫేస్‌మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, ఆక్సిజన్‌ ఇలా ప్రతిదీ సమస్యే. ఈ పరిస్థితుల నుంచి ముంబయిని గట్టెక్కించడానికి చాహల్‌ ఎంతో ప్రణాళికా బద్ధంగా శ్రమించారు. స్వల్ప కాలంలోనే అదుపులోకి వచ్చింది. కేంద్ర మార్గదర్శకాలకనుగుణంగా రక్షణ రంగంలో అనుభవమున్న మరో ఇద్దరితో కలిసి తన ప్రణాళికను అమలు చేశారు. టెస్టులు చేసిన ల్యాబులు రిపోర్టులను నేరుగా బాధితులకు పంపకుండా… బీఎంసీ కంట్రోల్‌ రూంకు పంపుతాయి. వీటి ఆధారంగా రోజుకు ఎన్ని కేసులు నమోదవుతున్నాయనే కచ్చితమైన నివేదిక అందేది. నేరుగా వచ్చిన సమాచారంతో ప్రజలు కూడా భయాందోళనకు గురికాకుండా చేశారు.

పాజిటివ్‌ వచ్చిన వారికి సకాలంలో వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా నగరంలో 24గంటలు పనిచేసేలా… 24 వార్‌రూంలు నెలకొల్పారు. ఒక్కో వార్‌ రూంలో 35 టెలిఫోన్లు, 12 మంది ఆపరేటర్లు, 13 మంది వైద్యులు, 15 మంది సహాయక సిబ్బంది, 12 అంబులెన్స్‌లు నిత్యం అందుబాటులో ఉంటాయి. ప్రతి వార్‌రూం పరిధిలో ఇంకో 11 డాష్‌బోర్డులు చొప్పున ఏర్పాటు చేసి… పరిస్థితిని పర్యవేక్షిస్తుంటారు. ముంబయి నగరంలో దాదాపు 60 టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఉండగా… వీటి నుంచి రోజుకు 11వేల వరకు రిపోర్టులు వస్తుంటాయి. బీఎంసీ కేంద్ర కార్యాలయంలోని కంట్రోల్‌ రూం సిబ్బంది… వార్‌రూంల వారీగా వేరు చేసి ఉదయం 6 గంటల కల్లా సంబంధిత వ్యక్తులకు సమాచారమిస్తారు. వైద్యసిబ్బంది నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షిస్తారు. ఒక వేళ అత్యవసరమైతే వాళ్లే దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్తారు. దీంతో ఆస్పత్రుల వద్ద రద్దీ అనూహ్యంగా తగ్గిపోయింది. పూర్తిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పడకల కేటాయింపు జరుగుతున్నందువల్ల ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండాపోయింది. ఈ ప్రణాళికను అమలు చేయడానికి భారీ స్థాయిలో వైద్య సిబ్బంది అవసరమైంది. దీంతో వార్‌ రూమ్‌లలో పని చేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన వైద్యులను నియమించాలని నగర కమిషనర్‌ నిర్ణయించారు. నెలకు 50వేలతో పాటు వీరికి వార్‌రూంకు దగ్గర్లోనే వసతి సదుపాయం కల్పించేలా… వెయ్యి మంది డాక్టర్లను, 650 మంది నర్సులను నియమించారు.

దాదాపు 850 కొత్త అంబులెన్స్‌లను, ప్రత్యేక శిక్షణ కలిగిన డ్రైవర్లను యుద్ధప్రాతిపదికన నియమించారు. అవసరమైన చోట్ల ఉబర్‌ సేవలను కూడా వినియోగించుకునేందుకు ఆ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు. మరోవైపు, ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడిని అరికట్టేందుకు వాటన్నింటినీ నగరపాలిక అధీనంలోకి తీసుకువచ్చారు. వైద్య సేవలకు కచ్చితమైన రేట్లు నిర్ణయించి… ఆస్పత్రిలో కరోనా బాధితుడిని చేర్చుకోవాలన్నా, డిశ్చార్చి చేయాలన్నా… బీఎంసీ అనుమతి తప్పనిసరి చేశారు. ఈ ప్రక్రియ అంతా వార్‌రూంల ద్వారానే జరగాలి. ఇక చనిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పంపేందుకు చర్యలు చేపట్టారు. అంతిమసంస్కారాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా బీఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో సంప్రదించి… ప్రత్యేక డాష్‌ బోర్డును అందుబాటులోకి తెచ్చారు. దీంతో నగరవ్యాప్తంగా ఉన్న 49 శ్మశానవాటికల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో… ఇందులో తెలుసుకోవచ్చు. అవసరమైన వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే… సిబ్బంది వచ్చి మృతదేహాలను తీసుకెళ్లి, దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇలాంటి పక్కా ప్రణాళికతో కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్ చాహల్‌ నేతృత్వంలోని బీఎంసీ కరోనాకు సమర్థవంతంగా అడ్డుకట్టవేయగలిగింది.

Read also : Alla Nani : బంధుత్వాన్ని ఉపయోగించి బాబు వ్యాక్సిన్లు రప్పిస్తే మాకు సమ్మతమే : ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని