AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KS Eshwarappa: సీఎం కావాలని ఉవ్విళ్లూరిన ఆయన.. మంత్రి పదవే పోయింది.. అయ్యో ఈశ్వరా, ఎంత పని జరిగింది..!

ఆయన పార్టీకి వీరవిధేయుడు. పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా ఒంటబట్టించుకున్నారు. బీసీల్లో గట్టి పట్టున్న నాయకుడు. ఆ రాష్ట్రంలో పార్టీని నిలబెట్టి, అధికారంలోకి తీసుకువచ్చిన కీలక నేతల్లో ఒకరు. అడ్డగోలు మాటలు మాట్లాడినా పార్టీ ఏనాడు చర్యలు చేపట్టలేదు. ఆయనకున్న పలుకుబడి అలాంటిది.

KS Eshwarappa: సీఎం కావాలని ఉవ్విళ్లూరిన ఆయన.. మంత్రి పదవే పోయింది.. అయ్యో ఈశ్వరా,  ఎంత పని జరిగింది..!
Ks Eshwarappa
Balaraju Goud
|

Updated on: Apr 16, 2022 | 7:08 PM

Share

KS Eshwarappa Resign: ఆయన పార్టీకి వీరవిధేయుడు. పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా ఒంటబట్టించుకున్నారు. బీసీల్లో గట్టి పట్టున్న నాయకుడు. ఆ రాష్ట్రంలో పార్టీని నిలబెట్టి, అధికారంలోకి తీసుకువచ్చిన కీలక నేతల్లో ఒకరు. అడ్డగోలు మాటలు మాట్లాడినా పార్టీ ఏనాడు చర్యలు చేపట్టలేదు. ఆయనకున్న పలుకుబడి అలాంటిది. కాని, దేనికైనా ఒక సమయం వస్తుంది అంటారు. ఇప్పుడాయన విషయంలో అదే జరిగింది. సీఎం కావాలని ఉవ్విళ్లూరిన ఆయన ఇప్పుడు ఉన్న మంత్రి పదవి పొగొట్టుకోవాల్సి వచ్చింది. అయ్యో ఈశ్వరా, ఎంత పని. జరిగింది.

రకరకాల వివాదాలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్న కర్ణాటకలో ఇప్పుడు తాజాగా రాజకీయ వివాదం రగులుకుంది. కర్ణాటక పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత KS ఈశ్వరప్ప రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి ఈశ్వరప్ప వేధింపుల కారణంగా తాను చనిపోతున్నానంటూ కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్యకు పాల్పడటం కర్ణాటకను కుదిపేసింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేయాలని, ఆయనను అరెస్టు చేయాలని కర్ణాటక విపక్షాలు కత్తులు దూశాయి. ప్రజాసంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. తాను ఏ తప్పు చేయలేదని, పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఈశ్వరప్ప భీష్మించుకు కూర్చున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు. ఈశ్వరప్ప స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ఆయనపై ఎటువంటి ఒత్తిడి లేదని సీఎం బసవరాజ్‌ బొమ్మై అంటున్నా వాస్తవం అది కాదనే విషయం అందరికీ అర్థమవుతోంది. కాని ఈశ్వరప్ప మాత్రం తన రాజకీయాల విషయంలో చాలా బలంగానే ఉన్నారు. తాను నిర్దోషిగా బయటపడి మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపడతానని ఈశ్వరప్ప గట్టిగా చెప్తున్నారు.

వివాదాల కారణంగా కర్ణాటకలో గడిచిన ఏడాది కాలంలో రాజీనామా చేసిన రెండో మంత్రి ఈశ్వరప్ప. కర్ణాటకలో కాంగ్రెస్‌- JDS సంకీర్ణ ప్రభుత్వం కూలడంలో ప్రధాన పాత్ర వహించిన రమేశ్‌ జార్కిహోలి, సెక్స్‌ CD బాగోతంలో పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్‌ ఆత్మహత్య ఈశ్వరప్ప పదవిని బలిగొంది. వాస్తవానికి కర్ణాటకలో నేడు బీజేపీ ఇంత బలంగా ఉందంటే దానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప అని అందరూ చెప్తారు. యడియూరప్పకు నమ్మినబంటుగా నిలిచిన కె.ఎస్‌.ఈశ్వరప్పకు కూడా అందులో ప్రధాన పాత్ర ఉందని కర్ణాటక బీజేపీలో అందరూ అంగీకరిస్తారు. దాదాపు నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఈశ్వరప్ప కేవలం ఒక్కసారి మాత్రమే ఓటమి చవిచూశారు.

మాస్‌ లీడర్‌గా ఎంతో పేరున్న 73 ఏళ్ల KS ఈశ్వరప్ప ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. యడియూరప్ప, జగదీశ్ శెట్టార్‌, కుమారస్వామి, బస్వరాజ్‌ బొమ్మై కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. దాదాపు ఆర డజనుకుపై శాఖలు నిర్వహించిన నాయకుడాయన. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కర్ణాటకలో దాదాపు 8 శాతం జనాభా ఉన్న కురబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈశ్వరప్ప.

కన్నడ రాజకీయాల్లో యడియూరప్పతో సమానంగా చక్రం తిప్పిన ఈశ్వరప్ప జీవితంలో కి తొంగి చూస్తే అనేక విషయాలు కనిపిస్తాయి. వివాదాలు ఆయనకు కొత్తకాదు. ఆయన మాట చాలా ఘాటుగా ఉంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆయనకు అలవాటే. ఏది పడితే అది మాట్లాడి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. కర్ణాటకలో బీసీ నాయకుడిగా పేరు తెచ్చుకోవడమే కాదు పార్టీలోనూ గట్టి పట్టు సంపాదించుకున్నారు. లింగాయత్‌ నాయకుడిగా యడియూరప్ప పేరు తెచ్చుకున్నారు. కాని ఆయనకు RSS అండదండలు అంతగా సంపాదించలేకపోయారు. దూకుడుతో కూడిన మాటలు మాట్లాడే ఈశ్వరప్పకు RSS అండదండలు పుష్కలంగా ఉన్నాయని కర్ణాటక బీజేపీ నేతలంటారు. యడియూరప్పలాగా ఈశ్వరప్ప ఏనాడు పార్టీని వీడలేదు. సంఘ్‌ పరివార్‌కు, పార్టీ సిద్ధాంతాలకు ఆయన ఎప్పుడూ విధేయుడిగా నిలిచారు. కర్ణాటక బీజేపీలో బలమైన బీసీ నాయకుడనే పేరుంది ఈశ్వరప్పకు. యడియూరప్ప ఎప్పుడూ ఒక అడుగు వెనకే ఉన్నారు. శికారిపుర అసెంబ్లీ స్థానం నుంచి యడియారప్పు ఎమ్మెల్యేగా ఉంటే, పొరుగునే ఉన్న శివమొగ్గను తన స్థానం ఏర్పరుచుకున్నారు. యడియూరప్ప బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉంటే ఆ తర్వాత ఆ స్థానాన్ని ఈశ్వరప్ప భర్తీ చేశారు. SPOT

ఈశ్వరప్ప బాల్యం, ఎదిగిన తీరు చూస్తే KGF హీరో రాకీని తలపిస్తుంది. ఈ భూమిపై ఐశ్వర్యవంతుడిగా నిలవాలన్న తల్లి కోరిక మేరకు రాకీ భాయ్‌ ఏ పనంటే ఆ పని చేస్తాడు. ఆ తరహా నేపథ్యమే ఈశ్వరప్పది. కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఈశ్వరప్ప నిలిచారంటే దానికి కారణం ఆయన తల్లే. బళ్లారి జిల్లాలో పుట్టిన ఈశ్వరప్ప తల్లిదండ్రులు శరణప్ప, బసమ్మ. 1950ల్లో వారి కుటుంబం శివమొగ్గకు వలస వచ్చింది. అక్కడి వక్క మార్కెట్‌లో ఈశ్వరప్ప తల్లిదండ్రులు రోజుకూలీలుగా పనిచేసేవారు. తాను కూడా పనిచేసి తల్లిదండ్రులకు అండగా నిలవాలనుకున్నారు ఈశ్వరప్ప. కాని, ఆయన తల్లి దానికి ఒప్పుకోలేదు, బాగా చదువుకొని సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆమె కొడుకుకు నూరిపోసింది.

ఈ క్రమంలోనే ఈశ్వరప్పకు శివమొగ్గకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ నేత నరసింహమూర్తి అయ్యంగార్‌తో పరిచయం ఏర్పడింది. విద్యార్థి దశలోనే ఈశ్వరప్ప ABVPలో చురుగ్గా వ్యవహరించారు. ఆ తర్వాత శివమొగ్గ పట్టణ బీజేపీ అధ్యక్షుడయ్యారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దిగ్గజం, KH శ్రీనివాస్‌ను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తల్లిమాటను స్ఫూర్తిగా తీసుకొని కన్నడ రాజకీయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో కేవలం ఒక్కసారి మాత్రమే ఆయన శివమొగ్గలో ఓటమి పాలయ్యారు. 2013లో బీజేపీని యడియూరప్ప వీడినప్పుడు ముఖ్యమంత్రిగా ఎదగాలని ఈశ్వరప్ప ఉవ్విళ్లూరారు. దురదృష్టవశాత్తు అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత యడియూరప్ప తిరిగి బీజేపీలోకి రావడం, మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఈశ్వరప్ప ఆశలు అడియాసలయ్యాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు బాగా బెడిసికొట్టాయి. ఇద్దరి మధ్య సఖ్యత కోసం బీజేపీ జాతీయ నాయకత్వం అనేక సందర్భాల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తన శాఖలో యడియూరప్ప జోక్యం చేసుకుంటున్నారని ఏకంగా గవర్నర్‌కు లేఖ రాసిన చరిత్ర ఈశ్వరప్పది. యడియూరప్పను అడ్డుకునేందుకు సంగోళి రాయన్న బ్రిగేడ్‌ ఏర్పాటు చేసి పార్టీలో ఒకింత తిరుగుబాటు సృష్టించారు.

శివమొగ్గలోని ఒక కాలేజీలో త్రివర్ణ పతకాన్ని తొలగించి కాషాయ జెండా ఎగరేసిన చరిత్ర ఉంది ఈశ్వరప్పకు. దానిపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించడంతో ఏకంగా, ఎర్రకోటపైన కాషాయ జెండా ఎగరేస్తాని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఈశ్వరప్ప. ఈ మాటలను బీజేపీ అధ్యక్షుడు నడ్డా తప్పుపట్టారు. 2012లో కర్ణాటక లోకాయుక్త పోలీసులకు బెంగళూరులోని ఈశ్వరప్ప నివాసంలో డబ్బులు లెక్క పెట్టే మెషీన్‌ దొరికింది. అప్పట్లో అది వివాదాస్పదమైంది. 2015 లో ఒక మహిళ జర్నలిస్టుతో అనుచితంగా మాట్లాడారు. మిమ్మల్ని ఎవరైన రేప్ చేస్తే నేనుగాని ఇంకెవరైనా గాని ఏం చేస్తారని మాట్లాడారు. అప్పట్లో ఈ మాటలు తీవ్ర వివాదంగా మారాయి. పార్టీని తరచూ ఇబ్బంది పెట్టేలా ఈశ్వరప్ప మాట్లాడినా, కర్ణాటక బీసీల్లో బలమైన నాయకుడిగా ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు బీజేపీ నాయకత్వం వెనుకడుగు వేసింది.

కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. యడియూరప్ప తరహాలోనే తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి అప్పగించే ఆలోచనలో ఈశ్వరప్ప ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తండ్రి వారసత్వాన్ని స్వీకరించేందుకు ఈశ్వరప్ప కుమారుడు KE కాంతేశ్‌ సిద్ధంగా ఉన్నారు. మరి భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.

Read Also…  Pakistan PM Letter: ప్రధాని మోదీ లేఖకు సమాధానం ఇచ్చిన పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్.. ఏమన్నారంటే..?