8 Yrs of Modi Govt: ఎనిమిదేళ్ల మోడీ పాలనలో ఎన్నో మార్పులు.. ప్రత్యేక పథకాలతో ప్రజలకు చేరువ

8 Yrs of Modi Govt:భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయనకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా మంది..

8 Yrs of Modi Govt: ఎనిమిదేళ్ల మోడీ పాలనలో ఎన్నో మార్పులు.. ప్రత్యేక పథకాలతో ప్రజలకు చేరువ
Follow us

|

Updated on: May 23, 2022 | 8:19 PM

8 Yrs of Modi Govt:భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయనకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా మంది ఆయన ధరించే దుస్తులు, ఆయన తినే ఆహారం, ఆయన ఎప్పుడు నిద్రిస్తారు, ఆయన ఫిట్‌నెస్ ఏంటి, మొత్తంగా ఆయన దినచర్య ఏంటనేది తెలుసుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలోనే.. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ 8 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా(మే26వ తేదీతో 8 సంవత్సరాలు పూర్తి) ప్రత్యేక కథనం అందిస్తున్నాము. ఏనిమిదేళ్ల కాలంలో దేశ ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. రైతులకు మేలు జరిగే స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ప్రజలకు చేరువయిన పథకాల్లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY), జన్ ధన్ నుండి జన్ సురక్ష, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధాన మంత్రి ముద్రా యోజన, స్టాండ్ అప్ ఇండియా పథకం, ప్రధాన మంత్రి వయ వందన యోజన, పీ యం కిసాన్ వంటి పథకాలు అమలు చేస్తోంది మోడీ సర్కార్‌. ఇవేకాకుండా మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న బీజేపీ తమ 8 ఏళ్ల పాలనలో మరింత ముందడుగు వేస్తోంది. 2023 ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని పోరాడుతోంది. 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పటి వరకు తన పాలనలో ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు మేలైన స్కీమ్‌లను ప్రవేశపెడుతూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అలాగే సరికొత్త పథకాలు కూడా వెలుగు లోకి తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. 2019 ఎన్నికల్లో కూడా విజయం సాదించి ప్రజలలో నమ్మకాన్ని పెంచుకుంది బీజేపీ.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PM Jan Dhan Yojana)

ఇవి కూడా చదవండి

అయితే ఏడున్నరేళ్ల కాలంలోనే జన్‌ ధన్‌ పథకం కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.1.5 లక్షల కోట్లు దాటినట్లు ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ( PMJDY ) ఖాతాలకు డిసెంబర్ 2021 చివరి వరకు రూ 1,50,939.36 కోట్లు జమ అయినట్లు కేంద్రం తెలిపింది. ఆగస్టు 15, 2014న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో PMJDY ప్రణాళికను ప్రకటించారు. 44.23 కోట్లకుపైగా జన్‌ ధన్‌ ఖాతాలు తెరవబడ్డాయి. అలాగే కోవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ కీలకంగా వ్యవహరించింది. అతి తక్కువ కాలంలోనే కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. కోవిడ్‌ నుంచి రక్షించేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తూ చర్యలు తీసుకుంది.

రూపే కార్డుతో రూ.2 లక్షల ప్రయోజనం:

ఎస్‌బీఐ రూపే డెబిట్‌ కార్డు ఉపయోగించే అన్ని జన్‌ధన్‌ ఖాతాలకు రూ.2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజ్‌ అందిస్తోంది.2014లో ప్రారంభమైన ప్రధాన్‌ మంత్రి జన్‌ ధన్‌ యోజన పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ పథకం ద్వారా ఎస్బీఐ రూపే జన్ ధన్ కార్డును జన్ ధన్ ఖాతాదారులకు అందిస్తోంది. దీని ద్వారా ఈ కార్డు కలిగిన కస్టమర్లను రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ సౌకర్యం అందిస్తోంది. అయితే రూపే కార్డ్ మీ ఎటిఎం లాగా పనిచేస్తుంది. దీని సహయంతో మీ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు.

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకం (Pradhan Mantri Suraksha Bima Yojana):

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరాలని భావించే వారు ప్రతి ఏటా రూ.12 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రమాద బీమా స్కీమ్. ఇందులో చేరితే చాలా తక్కువ ప్రీమియంతోనే అధిక ప్రయోజనం పొందొచ్చు. అంటే మీరు ఏడాదికి రూ. 12 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. లేదంటే ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే.. అప్పుడు కూడా రూ. 2 లక్షలు లభిస్తాయి. పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే అప్పుడు రూ.లక్ష వరకు అందిస్తారు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల నెలకు ఒక్క రూపాయి పొదుపు చేస్తే రూ. 2 లక్షల బెనిఫిట్ లభిస్తుంది.

ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana):

ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇతర జీవిత బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఈ బీమా ప్రయోజనం అందించడం కోసం బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. దేశ పౌరులందరికీ జీవిత బీమా ఉండాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. 2015 మే 9న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను ప్రారంభించారు. ఇది ఒక సంవత్సరంపాటు రూ.2లక్షల జీవిత బీమాను అందిస్తుంది. ఈ బీమా తీసుకొన్న వ్యక్తి ఒకవేళ మరణించినట్లయితే.. నామినీకి (వారి కుటుంబానికి) పూర్తి కవరేజీని అందిస్తారు. ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నెట్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అటల్ పెన్షన్ యోజన (atal pension yojana):

9 మే 2015న ప్రారంభించబడిన అటల్ పెన్షన్ యోజన దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడంపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. APY అనేది NPS మొత్తం నిర్మాణం కింద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహించబడుతోంది. APY చందాదారుల సహకారంపై ఆధారపడి, 60 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస పెన్షన్‌కు అందుకోవచ్చు. ఈ స్కీమ్‌ కింద ఇప్పటి వరకు 4 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.

ప్రీమియంలను నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధ-సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. ఎంచుకున్న పెన్షన్ మొత్తం, వ్యక్తి వయస్సు ఆధారంగా కాంట్రిబ్యూషన్ మొత్తం నిర్ణయించబడుతుంది. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల చెల్లుబాటు అయ్యే పొదుపు ఖాతాదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు. ఖాతాదారుడు మరణించిన తర్వాత, జీవిత భాగస్వామికి సమాన పెన్షన్ లభిస్తుంది. ఖాతాదారుడు, అతని/ఆమె జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన సందర్భంలో నామినీకి పూర్తి మొత్తం లభిస్తుంది.

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకం (PM Kisan Samman Nidhi Yojana Scheme:

కేంద్రం తీసుకువచ్చిన పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం (PM kisna yojana) ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. ఈ స్కీమ్‌ ద్వారా ప్రతి భూమి ఉన్న రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది. రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనం సాగు కోసం 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, ఇతర రకాల ప్రభుత్వ పెన్షన్‌ల ప్రయోజనం పొందని రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. దీనితో పాటు, కుటుంబంలో భార్య లేదా భర్త మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇద్దరికి డబ్బులు వస్తున్నట్లయితే అనర్హులు.

పీఎం ముద్ర యోజన పథకం (PM Mudra Yojana Scheme:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్‌లలో ప్రధాన మంత్రి ముద్ర యోజన ఒకటి. ఇందులో మొదటి దశలో చాలా మందికి అండగా నిలిచింది ఈ పథకం. ఈ స్కీమ్‌ కింద బ్యాంకులు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. రుణాలు పొందడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఈ స్కీమ్‌ ద్వారా అర్హులైన వారు సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం ముద్రా యోజన కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం అందజేస్తారు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉన్నాయి. వీటిల్లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా 08 ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల వరకు రుణాలను అందిస్తుంది.

స్టాండ్ అప్ ఇండియా (Stand-Up India)

స్టాండ్ అప్ ఇండియా.. కొత్త ప్రాజెక్టు కోసం బ్యాంక్ ద్వారా షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళా రుణగ్రహితకు రూ.10 లక్షల నుంచి ఒక కోటి రూపాయల రుణం ఇవ్వడం స్టాండ్ అప్ ఇండియా పథకం లక్ష్యం. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు.

పీఎం కుసుమ్ యోజన (PM Kusum Scheme):

ఈ పథకం ద్వారా ప్రభుత్వం.. తమ పొలంలో లేదా ఇంటిపై సోలార్ ప్యానెల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకునే వారికి డబ్బు ఇస్తుంది. దీనితో మీరు మీ ఇంటికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. అదనపు విద్యుత్తును తిరిగి ప్రభుత్వానికి అమ్మవచ్చు. ఈ పథకం ద్వారా విద్యుత్ కోసం అయ్యే ఖర్చు ఆదా చేయడమే కాకుండా.. మీకు ఆదాయం కూడా వస్తుంది. ఈ పథకంలో భాగంగా 60 శాతం సబ్సిడీ ఇస్తారు.

ఎంఎస్ఎంఈ స్కీమ్ (MSME Scheme)

మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేసింది. దీని కింద వ్యాపారం ప్రారంభించడానికి స్టార్టప్‌లకు, ఎంఎస్ఎంఇలకు దాదాపు రూ. 2 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది.

స్వనిధి పథకం (PM SVANidhi):

ప్రతి వర్గానికి రుణ అందించాలనే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా దేశంలోని వీధి వ్యాపారులకు (చిరు వ్యాపారులు) తమ సొంత పనులను కొత్తగా ప్రారంభించడానికి రుణాలను మంజూరు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్న వ్యాపారం కోసం ప్రజలకు రూ. 10,000 రూపాయల వరకు రుణం ఇస్తారు. ఈ రుణాన్ని ఏడాదిలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకంలో చేరితే కచ్చితమైన పెన్షన్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. ప్రస్తుతం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. అంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల వరకు ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. ఈ పథకంలో 2023 మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ మార్చి 31 తర్వాత వడ్డీ రేటు మారే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. అందుకే ముందుగానే చేరితే 7.4 శాతం వడ్డీని పొందొచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి