8 Yrs of Modi Govt: ఈశాన్య భారత్ అభివృద్ధి కోసం మోదీ కృషి.. ఆ ఘనత ప్రధానికే దక్కిందన్న అమిత్ షా..!
8 Yrs of Modi Govt: బోడోలాండ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోందన్నారు..
8 Yrs of Modi Govt: బోడోలాండ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అరుణాచల్ ప్రదేశ్‌లో రామకృష్ణ మిషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ బోడోలాండ్ సమస్యపై ప్రసంగించారు అమిత్ షా. ‘‘చాలా ఏళ్ల తర్వాత బోడోలాండ్ సమస్యను సులువుగా పరిష్కరించే పనిని దేశ ప్రధాని చేశఆరు. త్రిపురలోని మిలిటెంట్ గ్రూపులకు ఆయుధాలు చేరకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. బ్రూ శరణార్థుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.’’ అని అమిత్ షా పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి అస్సాం, అరుణాచల్ మధ్య ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ఈశాన్య రాష్ట్రాలు చాలా అభివృద్ధి చెందాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు క్రమంగా సమస్యలు పరిష్కారమవుతున్నాయని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఈశాన్య రాష్ట్రాల యువత.. ఆయుధాలు చేతపట్టి దేశ రక్షణలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ఎనిమిదేళ్ల కాలంలో దాదాపు 9,000 మంది మిలిటెంట్లు ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చారని వెల్లడించారు హోంమంత్రి అమిత్ షా. ‘‘మోదీ 2014లో ప్రధానిగా ఎన్నికైన నాటి నుంచి ఈశాన్య రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. దేశం మొత్తం ఈశాన్య ప్రాంతాలను తనదిగా ప్రేమిస్తోంది.’’ అని అన్నారు.
అంతకుముందు అరుణాచల్‌లోని నరోత్తమ్ నగర్‌లో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడం ఇది రెండోసారి. 34వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన చివరిసారిగా 2020లో అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించారు. కాగా, తాజా పర్యటనలో లోహిత్ జిల్లాలోని వక్రోలో 51 అడుగులు రుషి పరశురాముని విగ్రహం ఏర్పాటుకు పునాది వేస్తారని, అలాగే 40 నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
కాగా, మెగా క్రాస్ కంట్రీ టూర్‌లో భాగంగా రాష్ట్రాల పర్యటన చేపట్టిన అమిత్ షా.. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అసోం, తెలంగాణ, కేరళ, ఉత్తరాఖండ్‌లను సందర్శించిన హోంమంత్రి అమిత్ షా.. మే 27, 28 తేదీల్లో వరుసగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో పర్యటించనున్నారు.