హిట్ అండ్ రన్.. ప్రమాదం చేసిన వ్యక్తి పారిపోతే.. పరిహారం పొందడం ఎలా.. ఇదిగో పూర్తి గైడ్
రోడ్డు ప్రమాదంలో బాధితుడు చనిపోతే సాధారణంగా పరిహారం లభిస్తుంది. కానీ ప్రమాదం చేసి వాహనం పారిపోతే ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంది. అలాంటి వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద బాధితులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పరిహారం ఎవరికి వర్తిస్తుంది? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో కుటుంబాన్ని కుదిపేస్తుంది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ లభించకపోతే బాధిత కుటుంబం పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. ఇలాంటి హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ కేసుల్లో బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిహార పథకాన్ని అమలు చేస్తోంది. అదే.. హిట్ అండ్ రన్ మోటార్ ప్రమాదాల బాధితులకు పరిహారం పథకం–2022. ఈ పథకం కింద ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు, తీవ్రమైన గాయాలకు గురైన బాధితుడికి రూ.50 వేల పరిహారం అందుతుంది. ఈ మొత్తాలను మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ నుంచి ప్రభుత్వం చెల్లిస్తుంది.
అయితే ఈ పథకం సాధారణంగా ప్రతి రోడ్డు ప్రమాదానికి వర్తించదు. ప్రమాదానికి కారణమైన వాహనం గుర్తు తెలియకపోవడం, ప్రమాదం చేసి వాహనం అక్కడి నుంచి వెళ్లిపోవడం వంటి హిట్ అండ్ రన్ ఘటనలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం, వైద్య సంబంధిత పత్రాలను భద్రపరచుకోవడం అత్యంత కీలకం.
దరఖాస్తు విధానం, కావాల్సిన పత్రాలు
ఈ పరిహారం కోసం అప్లై ఎలా చేసుకోవాలంటే.. బాధితుడు లేదా మరణించిన వ్యక్తి తరఫున చట్టబద్ధ వారసుడు, లేదా కుటుంబ సభ్యులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రమాదం జరిగిన పరిధిలోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) లేదా తహసీల్దార్ (MRO) కార్యాలయానికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ఫారం తీసుకొని.. వివరాలు ఫిల్ చేసి సమర్పించాలి.
ఈ పరిహారం కోసం అప్లై చేసుకోవాలంటే అవసరమైన పత్రాలు ఇవే
- బాధితుడి గుర్తింపు పత్రం, ఆధార్ వివరాలు.
- బ్యాంకు ఖాతా, IFSC వివరాలు.
- ప్రమాదం జరిగిన తేదీ, సమయం, ప్రాంతం వివరాలు.
- ఎఫ్‌ఐఆర్ (FIR) కాపీ.
- గాయాలకు సంబంధించిన వైద్య నివేదిక.
- మరణం సంభవిస్తే డెత్ సర్టిఫికెట్, పోస్టుమార్టం నివేదిక.
- మరణించిన వ్యక్తితో దరఖాస్తుదారుడి సంబంధాన్ని నిర్ధారించే వివరాలు.
మరణిస్తే కుటుంబ సభ్యులు ఏం చేయాలి?
ప్రమాదంలో బాధితుడు మరణించినట్లయితే అతని చట్టబద్ధ వారసుడు పరిహారం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఇందుకు మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు పోస్టుమార్టం నివేదిక, ఎఫ్‌ఐఆర్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి తన వైద్య, ప్రమాద సంబంధిత పత్రాలతో పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చికిత్సకు సంబంధించిన రికార్డులు, గాయాల నివేదిక వంటి పత్రాలు ఈ దరఖాస్తు ప్రక్రియలో ఉపయోగపడతాయి.
దర్యాప్తులో పోలీసుల నివేదికే కీలకం
హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రమాదానికి కారణమైన వాహనం లేదా దాని డ్రైవర్‌ను గుర్తించడం సాధ్యం కాలేదనే విషయాన్ని దర్యాప్తులో పోలీసులు నిర్ధారించాల్సి ఉంటుంది. ప్రమాదానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు వివరాలు తదుపరి క్లెయిమ్ ప్రక్రియలో కీలకంగా ఉంటాయి. అధికారులు సమర్పించిన పత్రాలు, పోలీసుల నివేదిక తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరిహారంపై నిర్ణయం తీసుకుంటారు. అర్హత నిర్ధారణ అయిన అనంతరం పరిహారం చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది.
బాధితులకు తెలియాల్సిన అవగాహన
రోడ్డు ప్రమాదంలో వాహనం ఆచూకీ దొరకకపోతే బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ హిట్ అండ్ రన్ పరిహార పథకం ఎంతో ఉపయోగకరం. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం, వైద్య, ఇతర సంబంధిత పత్రాలను భద్రపరచుకోవడమే పరిహారం పొందేందుకు మొదటి అడుగు.
మరన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
