AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తవాళ్లు వచ్చాకే నీ అడ్వాన్స్ పైసలిస్తా.. కట్ చేస్తే కోర్టు దెబ్బకు ఫ్లాట్ ఓనర్ గిలగిల..

కొత్త అద్దెదారుడు వస్తేనే నీ సెక్యూరిటీ డిపాజిట్ వెనక్కి ఇస్తా.. అప్పటివరకు ఆగాల్సిందే.. అంటూ బెంగళూరులో ఓ ఇంటి యజమాని పెట్టిన కొర్రీ ఇప్పుడు అతడికే రివర్స్ కొట్టింది. ఆధారాలు లేకుండా అద్దెదారుడి డిపాజిట్‌ను ఆపే హక్కు ఎవరికీ లేదని కన్స్యూమర్ కోర్టు తేల్చిచెప్పింది. ఏకంగా రూ.80 వేల డిపాజిట్ సొమ్మును 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ సదరు ఓనర్‌కు షాకింగ్ తీర్పు ఇచ్చింది.

కొత్తవాళ్లు వచ్చాకే నీ అడ్వాన్స్ పైసలిస్తా.. కట్ చేస్తే కోర్టు దెబ్బకు ఫ్లాట్ ఓనర్ గిలగిల..
Bengaluru Consumer Court Slams Landlord
Krishna S
|

Updated on: Oct 22, 2026 | 6:42 PM

Share

ఫ్లాట్ ఖాళీ చేసిన అద్దెదారుడి సెక్యూరిటీ డిపాజిట్‌ను అకారణంగా నిలిపివేస్తూ.. కొత్త అద్దెదారుడు వచ్చిన తర్వాతే డబ్బులు ఇస్తానంటూ ఇబ్బందులకు గురిచేసిన ఓ ఇంటి యజమానికి వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. ఎలాంటి నష్టపరిహారం లేదా పెండింగ్ బకాయిలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేకుండా అద్దెదారుడి డిపాజిట్‌ను నిలిపివేయడం సేవా లోపం, అనుచిత వ్యాపార ధోరణేనని తేల్చిచెప్పింది. బాధితుడికి రూ.80,000 సెక్యూరిటీ డిపాజిట్‌ను 9 శాతం వడ్డీతో పాటు అదనంగా రూ.10,000 కోర్టు ఖర్చులు చెల్లించాలని బెంగళూరు వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.

అసలేం జరిగింది?

వీరేశ్వర్ మహంత అనే వ్యక్తి బెంగళూరులోని ఒక ఫ్లాట్‌కు నెలకు రూ.25,000 అద్దె చెల్లిస్తూ, రూ.80,000 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి నివాసముంటున్నాడు. ఆయన నాలుగు నెలల పాటు అద్దెను ఎలాంటి డిఫాల్ట్ లేకుండా సక్రమంగా చెల్లించాడు. అయితే ఆయన పనిచేసే ఆఫీస్ నాగవార నుంచి వైట్‌ఫీల్డ్‌కు మారడంతో మార్చి 16న ఫ్లాట్ ఖాళీ చేయనున్నట్లు ఇంటి యజమాని బసిరెడ్డి కొండారెడ్డికి సమాచారం అందించాడు. మార్చి 30న ఫ్లాట్‌ను మంచి స్థితిలోనే అప్పగించి, తాళాలను ఓనర్‌కు ఇచ్చేశాడు.

అనంతరం తన సెక్యూరిటీ డిపాజిట్ రూ.80,000 తిరిగి ఇవ్వాలని మహంత పలుమార్లు కోరినా యజమాని స్పందించలేదు. పైగా ఏప్రిల్ 16న జరిగిన వాట్సాప్ సంభాషణలో.. ఫ్లాట్‌లోకి కొత్త అద్దెదారుడు వచ్చిన తర్వాత మాత్రమే డిపాజిట్ డబ్బులు వెనక్కి ఇస్తానని యజమాని మెలిక పెట్టాడు. లీజు అగ్రిమెంట్‌లో అలాంటి నిబంధన ఏదీ లేకపోవడంతో పాటు లీగల్ నోటీసు పంపినా యజమాని బదులివ్వకపోవడంతో బాధితుడు చివరకు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.

ఆధారాలు లేకుండా డిపాజిట్ ఆపలేరు..

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బెంగళూరు అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ యజమాని వాదనలను తోసిపుచ్చింది. 3 నెలల ముందస్తు నోటీస్ ఇవ్వలేదని, రిపేర్ ఖర్చులు ఉన్నాయని యజమాని ఆరోపించినప్పటికీ, అందుకు సంబంధించిన బిల్లులు లేదా ఫ్లాట్ దెబ్బతిన్నట్లు సరైన ఆధారాలు చూపించలేకపోయాడు. ‘‘డిపాజిట్‌లో కోతలు విధించే హక్కు ఉందని కేవలం మాటల్లో చెప్పినంత మాత్రాన మొత్తం సెక్యూరిటీ డిపాజిట్‌ను నిరవధికంగా ఆపేయలేరు. ఫ్లాట్‌కు నష్టం వాటిల్లినట్లుగానీ, కరెంట్, మెయింటెనెన్స్ బకాయిలు ఉన్నట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవు. ఆరోపణలు చేసినంత మాత్రాన అవి సాక్ష్యాలు కాజాలవు’’ అని కమిషన్ స్పష్టం చేసింది.

అద్దెదారులు గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు

ఇల్లు ఖాళీ చేసే సమయంలో డిపాజిట్ వివాదాలు రాకుండా ఉండేందుకు అద్దెదారులు రెంట్ పేమెంట్ రసీదులు, అగ్రిమెంట్ కాపీ, ఖాళీ చేస్తున్నట్లు ఇచ్చిన రాతపూర్వక నోటీస్, తాళాలు అప్పగించే నాటి ఫ్లాట్ ఫొటోలు లేదా వీడియోలను భద్రపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యజమానులు డిపాజిట్ ఇవ్వకుండా వేధిస్తే ఆధారాలతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు లేదా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915కు ఫిర్యాదు చేయవచ్చు.

Follow Us